2009 లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క చోట.. గెలుచుకుంది. అప్పట్లో హిందూత్వ నినాదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేటలో గెలిచారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని గ్రేటర్ పరిధిలో ఐదు సీట్లు గెలిచింది. ఆ తర్వాత బీజేపీకి కొమ్ములొచ్చాయి. టీడీపీ వల్లే తాము బలం కోల్పోయామని.. రెచ్చిపోవడం ప్రారంభించారు. టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ఒంటరి పోరు అంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. చివరికి వారి కోరిక నెరవేరింది. ఎన్నికలు కూడా వచ్చాయి. పొత్తుల్లేకుండా పోటీ చేశారు. దీంతో.. మళ్లీ 2018లో మళ్లీ 2009 స్థాయిలో ఒక్క చోటకి పడిపోయారు. ఇప్పుడు హిందూత్వవాదానికి బ్రాండ్ లా ఉన్నరాజాసింగ్ లోథ్.. ఒక్క గోషామహల్ సెగ్మెంట్ లో మాత్రం విజయం సాధించారు. కిషన్ రెడ్డి సహా సిట్టింగులంతా ఓడిపోయారు.
తెలంగాణలో మొదటి నుంచి బీజేపీ సైజుకు మించి ఆలోచించింది. రెండంకెల సీట్లు గెలుచుకుంటామని హడావుడి చేసింది. కనీసం రెండు సీట్లయినా దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ అగ్రనేతలైన లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో పాటు చింతల రామచంద్రా రెడ్డి కూడా ఓడిపోయారు.
ముందునుంచి కూడా ఈసారి ఎన్నికల్లో రెండంకెల స్థానాలను కైవసం చేసుకుంటామని అగ్ర నేతలందరూ చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగ్గానే ప్రధాని మోదీతో సహా అగ్రనేతలందరినీ ప్రచారానికి వినియోగించారు. అయినా సరే కారు జోరు ముందు కమలం తట్టుకోలేకపోయింది. నిర్మల్, ముథోల్, నిజామాబాద్ రూరల్, కల్వకుర్తి, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జుక్కల్, ఆదిలాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకపోయింది. గత ఎన్నికల్లో నగరంలోని అంబర్పేట, ఖైరతాబాద్, ఉప్పల్, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్లింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. చివరి క్షణాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వలస వచ్చిన వారికి కూడా టికెట్లిచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ.. బీజేపీకి నాలుగు నుంచి ఏడు సీట్లు వస్తాయని తేలింది. వాటిని చూసి సంతోషపడ్డారు. టీఆర్ఎస్ కు మద్దతిస్తామంటూ ఉబలాటపడ్డారు. చివరికి మొత్తానికే తేడా వచ్చింది. బీజేపీ నేతలకు.. ఇప్పటికైనా తమ బలం ఏమిటో అంచనా వేసుకుంటారేమో..?