కర్ణాటక రాష్ట్రాన్ని బీజేపీ సుమారు రెండు దశాబ్దాలపటు ఎదురు లేకుండా పాలించింది. కానీ అవినీతి గనులు త్రవ్వి పోసిన గాలి జనార్ధన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఇరువురు కలిసి రాష్ట్రంలో పార్టీని ముంచారు. కర్నాటకలో అడుగుపెట్టాలని అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2013లో రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నేతృత్వంలో ఇంతవరకు అంతా సజావుగానే సాగుతున్నట్లు కనిపించినా ఇటీవల బెంగళూరు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో మళ్ళీ బీజేపీ విజయం సాధించడంతో కాంగ్రెస్ కంగుతింది.
మొత్తం 197 సీట్లలో బీజేపీ 100 సీట్లు కైవసం చేసుకోగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 75 సీట్లే దక్కాయి. జె.డి.యస్. పార్టీ 14 సీట్లు, స్వతంత్ర అభ్యర్ధులు 8 సీట్లు దక్కించుకొన్నారు. ఇది ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుతున్నారు. కాంగ్రెస్ అధికారం చేప్పట్టిన రెండేళ్ళలోనే ప్రజలు దానిని తిరస్కరించడం మొదలుపెట్టారని ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఆరంభం మాత్రమేనని రాష్ట్ర బీజేపీ నేతలు చెపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మునిసిపల్ ఎన్నికలలో విజయ డంకా మ్రోగించిన తమ పార్టీ కర్ణాటకలో కూడా విజయం సాధించి హ్యాట్ ట్రిక్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకు కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు తమకు వరుస విజయాలు అందిస్తున్నారని ఆయన అన్నారు.
ఈ విజయం బీజేపీకి గొప్పదే కావచ్చును. కానీ అంత పొంగిపోవలసినంత గొప్ప విజయమేమీ కాదు. ఈ ఏడాది అక్టోబర్-నవంబరు నెలల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒకవేళ అక్కడ బీజేపీ అధికారంలో ఉన్న జేడీయు, దానితో జత కట్టిన కాంగ్రెస్ మరియు మరో ఐదు పార్టీలను ఓడించి విజయం సాధించగలిగితే అప్పుడు పండగ చేసుకొన్నా అర్ధం ఉంటుంది.