దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రుఘనందన్ రావు 1700 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. చివరి రౌండ్ వరకూ హోరాహోరీగా సాగిన ఎన్నిక కౌంటింగ్ సస్పెన్స్ ధ్రిల్లర్ను తలపించింది. మొదట్లో బీజేపీ.. ఆ తర్వాత టీఆర్ఎస్.. మళ్లీ చివరి రౌండ్లలో బీజేపీ పుంజుకుంది. చివరికి అతి స్వల్ప తేడాతో అయినా టీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. ట్రెండ్స్ మాత్రం అలా మారలేదు. పోస్టల్ ఓట్లలో టీఆర్ఎస్ నాలుగు వందలకుపైగా ఓట్ల మెజార్టీ సాధించడంతో వాటితోనైనా బయటపడతారని అనుకున్నారు. కానీ… వారి ఆశలు నెరవేరలేదు.
టీఆర్ఎస్కు తిరుగులేని పట్టు ఉన్న మండలాల్లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మెజార్టీ వచ్చింది. హరీష్ రావు దత్తత తీసుకున్న గ్రామం చేకోడులోనూ.. బీజేపీకి ఇరవైకిపైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమయింది. ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఇరవై వేల ఓట్లకు కొద్దిగా ఎక్కువ వచ్చాయి. మొదటి నుంచి టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేయడంతో.. పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే అన్నట్లుగా సాగడంతో.. ఓటర్లు కూడా.. ఆ రెండు పార్టీల మధ్య అన్నట్లుగా విడిపోయారు. సంప్రదాయ ఓటర్లు మాత్రమే కాంగ్రెస్కు ఓట్లు వేశారు.
రెండేళ్ల కిందట జరిగిన తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా అరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టీఆర్ఎస్ కు.. ఇప్పుడు షాక్ తగలడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. పెద్దగా క్యాడర్ లేని బీజేపీ.. 2014, 2018 ఎన్నికల్లో ఇరవై వేల లోపు ఓట్లు సాధించిన రఘునందన్ రావు ఇప్పుడు అన్ని మండలాల్లో పట్టు సాధించారు. హరీష్ రావు బాధ్యత తీసుకున్న ఎన్నికల్లో ఓడిపోవడం.. ఇదే ప్రథమం.