భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో… గ్రేటర్ ఎన్నికలను ఎలా నిర్వహించాలన్నదానిపై తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ .. బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞాపన పత్రం అందించింది. బీజేపీ మాత్రం.. ఈవీఎంతో నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఓటమి భయంతోనే బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్, ఎంఐఎంలు కోరుతున్నాయని బీజేపీ నేతలు మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరిగితే రిగ్గింగ్‌కు అవకాశం ఉంటుందంటున్నారు.
కారణం ఏదైనా కానీ.. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి టీఆర్ఎస్ ఈవీఎంల వాడకంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహించారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలను కూడా అలాగే నిర్వహించడం దాదాపు ఖాయమే. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈవీఎంల కోసం పట్టుబడుతున్నారు. రాజకీయ పార్టీలన్నీ తమకు వ్యతిరేకంగా ఫలితాలొస్తే ఈవీఎంల మీద అనుమానపడటటం ప్రారంభిస్తున్నాయి. అనుకూల ఫలితాలొస్తే మాత్రం సమర్థిస్తున్నాయి. దీంతో ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు ఓ స్టాండ్ అంటూ లేకుండా పోయింది. ఈ సమయంలో కరోనా మహమ్మారి ఎన్నికల వ్యవస్థలో మార్పులు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఒకే బటన్‌ను వందల మంది నొక్కితే.. ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా.. అందరికీ వ్యాపించేస్తుందన్న భయం అధికారవర్గాల్లోనూ వినిపిస్తోంది. అయితే బీహార్ అసెంబ్లీ, ఇతర ఉపఎన్నికల విషయంలో బ్యాలెట్ ఉపయోగించాలనే ఆలోచనను కేంద్ర ఎన్నికల కమిషన్ చేయలేదు. స్టేట్ ఎస్ఈసీల విషయంలో మాత్రం ఆయా ప్రభుత్వాల ఇన్ ఫ్లూయన్స్ ఉంటుంది కాబట్టి బ్యాలెట్‌కు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కారణంగా గ్రేటర్లో బ్యాలెట్‌తోనే పోరు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.