ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఆ పార్టీ బలం ఒక్క శాతంలోపు ఓట్లు మాత్రమే. పుంజున్న దాఖలాలు లేవన్న నివేదికలూ ఉన్నాయి. అలాంటప్పుడు పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ సీట్లు కేటాయించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూసేలా ఒప్పందంతోనే ఈ సీట్లు ఇచ్చారన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది.
వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారో తెలుసు కాబట్టి ఎన్నికల సంఘం కఠినంగా ఉండేందుకు బీజేపీకి సీట్లు కేటాయించారని అనుకున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి సహకారం ఇప్పుడు లభించడం లేదు. పుంగనూరులో జరిగిన దాడులు.. పల్నాడులో ఉద్రిక్తలు.. రాష్ట్రం మొత్తం గోవా మద్యం డంపులు ఉన్నా పట్టించుకోని పోలీసుల తీరు చూసి ఆశ్చ్యపోవాల్సి వస్తోంది. ఇక పాలనలో సీఎస్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. సీఎస్, డీజీపీ జగన్ కోసం పని చేసే అధికారులు అని అనేక సార్లు ఆరోపించారు. పించన్ల విషయంలో అనేక మంది మృతికి కారణమయ్యారని ఆరోపణలు ఉన్న సీఎస్ పై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు.
డీజీపీ విషయంలోనూ .. అంతే. ఆయన ఇంచార్జ్ డీజీపీగా ఉన్నారని ఆయన శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని మార్చాలని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు. అయితే కొంత మంది అధికారుల్ని మాత్రం బదిలీ చేశారు. ఆ సహకారం సంగతి పక్కన పెడితే తాజాగా గాజు గ్లాస్ సింబల్ ఇండిపెండెంట్లకు కేటాయించే విషయంలోనూ కూటమికి సమస్యలు వచ్చి పడ్డాయి. గాజు గ్లాస్ గుర్తు జనసేనకు రిజర్వ్ చేసిన తర్వాత ఇండిపెండెంట్లకు కేటాయించకూడదు. కానీ కేటాయించారు. ఈసీకి విజ్ఞప్తి చేసినా ఆదేశాలు ఇవ్వలేదన్న అసంతృప్తి కూటమి నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని రెండు పార్టీల క్యాడర్ గట్టిగా భావిస్తోంది.