మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతూ ఉండటంతో భాజపా ఇప్పట్నుంచే జాగ్రత్తపడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా జాగ్రత్తలో పెడుతోంది..! భాజపా నేతలందరూ విధిగా ‘నమో’ మొబైల్ అప్లికేషన్ వాడి తీరాలంటూ జాతీయ నాయకత్వం సూచిస్తోంది. ఎప్పటికప్పుడు వారి కార్యకలాపాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలతోపాటు సమాచారాన్ని నమో ఆప్ ద్వారానే షేర్ చేసుకోవాలని చెబుతోంది. నిజానికి, ఇప్పటికే కొంతమంది నాయకులు ట్విట్టర్ ద్వారా ఆ పని చేస్తున్నారు. కానీ, ఇకపై ట్విట్టర్ కు ప్రాధాన్యత తగ్గించి, కేవలం నమో అప్లికేషన్ మాత్రమే వాడాలంటూ చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్టు కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ ఆప్ ద్వారా ప్రజలు అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు!
నమో ఆప్ వాడాలంటూ ఎందుకంతగా ఒత్తిడి తెస్తున్నారంటే… చాలా కారణాలున్నాయి, అలాగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొదటిది, ఈ యాప్ ద్వారా అన్ని ప్రాంతాల ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనేది ఒక ప్లాట్ ఫామ్ కిందికి వస్తుంది. దీంతో కొంతమంది నేతలు తమ పనితీరును సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంకోటి, మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి, ఇంతవరకూ ప్రభుత్వం సాధించిన విజయాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే… ఈ ఆప్ ద్వారా సులభతరం అవుతుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. అన్నిటికీ మించి, భాజపా నేతలందరి కార్యకలాపాలూ ఒక ప్లాట్ ఫామ్ కిందికి వస్తాయి కాబట్టి, జాతీయ నాయకత్వంతోపాటు, ప్రధాని మోడీ కూడా నాయకుల పనితీరుపై తెలుసుకోవడం చాలా సులభతరం అవుతుంది. అంతేకాదు, ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎంపికకు కూడా ఈ ఫీడ్ బ్యాక్ ఉపకరిస్తుంది కదా!
ఈ అప్లికేషన్ వినియోగం తప్పనిసరి చేయడంతో కొంతమంది నేతలకు కష్టాలు తప్పడం లేదు! స్మార్ట్ ఫోన్లు వాడటం రానివారు, టెక్నాలజీ వినియోగం తెలియనివారు కొంత ఆందోళనకు గురౌతున్నారట. అలాంటివారూ చాలామంది ఉన్నారు కదా. అయితే, వారి కోసం ప్రత్యేకంగా క్రాష్ కోర్సులను కూడా భాజపా అధినాయకత్వం ప్రవేశపెట్టింది. ప్రతీ నెలలో రెండు, నాలుగు మంగళ వారాల నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో నమో ఆప్ వినియోగ శిక్షణ తరగతులను కూడా పార్టీ ఏర్పాటు చేస్తోంది. దీంతో నాయకులందరూ విధిగా స్మార్ట్ ఫోన్ వాడాల్సి వస్తోంది. సో.. భాజపా నాయకులందరూ నమో అనాల్సిందేనన్నమాట.