వ్యాక్సిన్ విషయంలో భారత ప్రభుత్వానికి ప్లాన్ బి లేదని.. అందుబాటులో ఉన్న ఒకటి, రెండు సంస్థలు మొత్తం సరఫరా చేయలేవని తెలిసినా.. ప్లాన్ బి కోసం ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయలేదని సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా లండన్‌లో కూర్చుకుని చెప్పడం.. ఇండియాలో చర్చనీయాంశం అయింది. ముందు చూపు లేని ప్రభుత్వం అని అందరూ అనుకున్నారు. అయితే.. ప్రభుత్వ వ్యవహారాల్లోనే ముందు చూపు లేదు.. పార్టీ వ్యవహారాల్లో.. రాజకీయాల్లో మాత్రం బీజేపీకి చాలా మందు చూపు.., ప్లాన్ బి.. ప్లాన్ సిలు కూడా ఉన్నాయి. దానికి బెంగాలే సాక్ష్యం. దేశం మొత్తం కరోనా కాష్టంతో రగిలిపోతూంటే.. బెంగాల్లో మాత్రం రాజకీయ కాష్టం రాజుకుంటోంది.
బెంగాల్ గవర్నర్ ధన్కర్… ఇప్పుడు చెలరేగిపోతున్నారు. ఆయన ఎన్నికలకు ముందు బెంగాల్ ప్రభుత్వంపై ఎంత విషం చిమ్మారో అంతా చిమ్మారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు లేవని చెబుతున్నారు. అదే విధంగా కేంద్రానికి నివేదికలు పంపి.. రాష్ట్రపతి పాలన పెట్టిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దీనంతటికి కారణం బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ హింస. తీవ్ర స్థాయి పోరాటం జరిగినప్పుడు… అధికారం అండతో ఒకరికొకరు వేధింపులకు పాల్పడినప్పుడు.. ఇలాంటిదాడులు ఎక్కువగా జరుగుతాయి. వీటిని కంట్రోల్ చేయాల్సింది పోయి… రెండు వర్గాలూ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.
బెంగాల్లో బీజేపీ గెలవకపోతే ఏం చేయాలి.. తక్కువ స్థానాలు వస్తే ఏం చేయాలి.. బొటాబొటి మెజార్టీతో మమతా బెనర్జీ గెలిస్తే ఏం చేయాలన్నదానిపై బీజేపీకి ముందుగానే ప్లాన్లు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ఇప్పుడు బెంగాల్లో స్క్రిప్ట్ ప్రకారం సీన్లు జరుగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేసే వరకూ… ఈసీ ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ ఉంది. ఈసీ పెట్టిన డీజీపీ ఉన్నారు. ఆయన సైలెంట్‌గా ఉండటంతో బెంగాల్ మొత్తం అల్లర్లు జరిగాయి. అయినా ఆ అల్లర్లు.. మమతా బెనర్జీని నిందిస్తూ.. గవర్నర్ .. రాజకీయ పాత్ర పోషిస్తున్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు లేవని చెబుతున్నారు. దీంతో… మమతా బెనర్జీ కూడా ఆయనకు అదే రీతిలో జవాబిస్తున్నారు.
ప్రతి పక్ష నేతగా సువేందు అధికారిని నియమించిన బీజేపీ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరికీ కేంద్ర భద్రత కల్పించారు. కనీసం వై కేటగిరి భద్రత కల్పించారు. సువేందు అదికారికి.. జడ్ కేటగిరి భద్రత కల్పించారు. ఈ తరహా రాజకీయాల్లో బెంగాల్‌ను బాయిల్ చేసేస్తున్నారు. అక్కడి ప్రజలు మాత్రం ఎన్నికలు తెచ్చిన కరోనా గండంతో సతమతమవుతున్నారు.