నేషనల్ డెమెక్రటికల్ అలయెన్స్ లో వైసీపీని చేర్చే కార్యక్రమాన్ని బీజేపీ ప్రారభించింది. జగన్ కేసుల విషయంలో తమ విధానాన్ని ఒక్కొక్కటిగా క్లారిటీ ఇస్తూ వస్తోంది. విజయసాయిరెడ్డికి నేరుగా పీఎంవోలోకి యాక్సెస్ ఇచ్చేసి.. వైసీపీ అంటరాని పార్టీ ఏమీ కాదని ఇంతకు ముందే తేల్చి చప్పారు. ఆ తర్వాత ఈడీ జప్తుల నుంచి కొన్ని కేసుల్లో మినహాయింపు కూడా ఇవ్వడంతో… డీల్ కు సిద్ధంగా ఉన్నామని…అంగీకారం తెలిపినట్లయింది. తెలుగుదేశం పార్టీ కూడా గుడ్ బై చెప్పడంతో ఇక ఎన్డీఏలోకి వైసీపీని తీసుకొచ్చే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. దీనికి స్పష్టమైన సంకేతమే… విజయవాడలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వ్యాఖ్యలు.
మోదీ కేబినెట్ మంత్రి, ఎన్డీఏలో భాగస్వామి అయిన రాందాస్ అధవాలే విజయవాడ వచ్చి జగన్కు మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడటం కలకలం రేపుతోంది. వైసీపీని ప్రణాళిక ప్రకారం..ఎన్డీఏలోకి తెచ్చేందుకు… కేసుల వ్యవహారాన్ని..ఎన్డీఏ సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పేందుకు కేంద్రమంత్రి ప్రయత్నించారు. విజయవాడ వచ్చి మరీ రాందాస్ అధవాలే… జగన్ కేసులు ఇంకా నిరూపితం కాలేదని చెప్పడం వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉందని.. టీడీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నానయి. ఆ కేసులను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని.. అవి వీగిపోతాయన్న అర్థంలో కేంద్రమంత్రి మీడియాకు చెప్పారు.అంటే ఇది ఓ రకంగా.. వైసీపీకి సంకేతాలు పంపడమే. ఎన్డీఏలో చేరితే కేసుల విషయం తాము చూసుకుంటామన్న అర్థం కేంద్రమంత్రి మాటల్లో ఉంది.
నిజానికి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. బీజేపీతో తమ అవగాహనపై ..నేరుగానే జాతీయ మీడియాకు వివరించారు. ప్రత్యేకహోదా ఇస్తామన్న పార్టీకే మద్దతుగా ఉంటామని..గట్టిగా ప్రకటించిన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పై తమకు నమ్మకం లేదన్నారు. తొలి సంతకం హోదాపై పెడతామన్న కాంగ్రెస్ పై కాంగ్రెస్ పై ఏ మాత్రం నమ్మకం లేదన్న విజయసాయిరెడ్డి… స్పెషల్ కేటగిరి స్టేషన్ ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని చెబుతున్న బీజేపీపై మాత్రం ఎనలేని విశ్వాసాన్ని ప్రకటించారు. అదే సమయంలో.. మోదీకి అనుకూలంగా..జాతీయ మీడియాల్లో వ్యాసాలు రాశారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం… ప్రధాని మోదీ తప్పు కాదంటూ ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పై నమ్మకం లేదంటే.. ఇక బీజేపీనే పార్టనల్ అని ఒప్పుకున్నట్లే కదా అని జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు.. విజయసాయిరెడ్డి ముసిముసి నవ్వులతోనే సమాధానం చెప్పారు.
రోగి కోరుకున్నదీ అదే.. వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్లు.. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే కోరుకుంటున్నాయి. అయితే అది కార్యరూపం దాల్చడానికి అనువైన పరిస్థితుల కోసం రెండు పార్టీలు.. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాయి. అది ఎప్పుడన్నదే సస్పెన్స్.