కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వానికి చేయవలసిన, చెబుతున్న, చేస్తున్న మంజూరులు, ఆర్ధిక సహాయాలలో వాస్తవాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అంతర్గతంగానైనా సమీక్షించుకోవలసిన అవసరం వుంది. బిజెపి కేంద్ర నాయకులు చెబుతున్న అంకెలకే పొంతన లేదు…ఇచ్చిన మొత్తం 1లక్షా 65 వేలకోట్లా, 1లక్షా 47 వేల కోట్లా 2లక్షల కోట్ల రూపాయలకు పైబడిందా??? అనే విషయం తమలో తామే అయినా చర్చించుకోవలసిందే!
అన్నీ ఒకేసారి ఇవ్వరు కదా! దశలవారీగానే ఇస్తారన్న సమర్ధన సమంజసం కాదు. ఉదాహరణకు మంగళగిరిలో 500 కోట్ల రూపాయలతో ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంజూరు చేశారు. ఏటా కనీసం నాలుగోవంతైనా విడుదల చేస్తే పని కనిపిస్తుంది. ప్రకటన చేసిన ఏడాదికి 30 కోట్లరూపాయలు కేటాయించారు. అలాగే రెండేసి వందల కోట్ల రూపాయల ఖర్చుకాగల పది వరకూ కేంద్ర విద్యాసంస్ధలకు ఆరు నుంచి పది కోట్ల రూపాయల లోపు నిధులు కేటాయించారు. 20 వేల కోట్లరూపాయల ఖర్చుకాగల పోలవరం ప్రాజెక్టుకి 850 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఈ లెక్కన నిధుల విడుదలైతే ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరూ చెప్పలేరు!
ఇందుకు కేంద్రానికి వుండే కారణాలు కేంద్రానికి వుండవచ్చు! అవి పూర్తిగా సమర్ధనీయమైనవే అయివుండవచ్చు!! అయితే ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విమర్శలను ఆపార్టీ రాష్ట్రశాఖ తట్టుకోలేక పోతోంది. ఆ అ సహనమంతా తెలుగుదేశం మీద చూపిస్తోంది…అది కూడా ఆ పార్టీ సొంత వ్యవహారమే!
ఎవరికి ఇష్టం వున్నా లేకపోయినా ఎపిలో హెచ్చుమంది ప్రజల మద్దతు తెలుగుదేశానికే వుందన్నది వాస్తవం. ఇదంతా చంద్రబాబు అద్భుతంగా పరిపాలిస్తున్నందు వల్ల కాదు. తాను, తన పార్టీ తప్ప రాష్ట్రానికి మరో ప్రత్యామ్నాయం లేదన్న వాతావరణాన్ని చంద్రబాబు సృష్టించడం వల్లే ఈ పరిస్ధితి ఏర్పడింది.దుర్మార్గమైన విభజనను, కేంద్రం సహాయనిరాకరణను, రాష్ట్రం ఆర్ధిక సమస్యలను, జనబలం వున్నా ఎత్తుగడా వ్యూహాలు లేని, అదుపుచేసుకోలేని జగన్ ఆవేశాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలిచేసుకున్నారు.
తెలిసో తెలియకో రాష్ట్రానికి చెందిన శక్తివంతులైన బిజెపి నాయకులు కూడా తెలుగుదేశం పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగేలాగే వ్యవహరిస్తున్నారు.
ఉత్తర భారతదేశం నాయకులకు అధికారంలో వుండే మేజిక్ ఫిగర్ మీద తప్ప దక్షిణాది రాష్ట్రాల మీదా శ్రద్ధ, ఆసక్తి లేదు. కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా ఏపార్టీ అయినా ఇంతే! నార్త్ లో దెబ్బతినిపోతున్నామని పసిగట్టి ఎపిని విభజిస్తే తెలంగాణా ప్రాంతం ఎంపి సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావచ్చన్న కేలిక్యులేషన్ తో రాష్ట్రాన్ని చీల్చేసి కాంగ్రెస్ చావుదెబ్బతింది.
ఈ నేపధ్యంలో బిజెపి రాష్ట్రశాఖ తెలుగుదేశం మీద ఘర్షణాత్మకవైఖరిని పక్కన పెట్టి తెలుగుదేశం ఎజెండాలో లేని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను కేంద్రనాయకత్వానికి వివరించి ఆమేరకు పనులు చేయించగలిగితే ప్రజలకు దగ్గరౌతుంది. నాయకులు కార్యకర్తల పార్టీగా కాక ప్రజల్లోకి చొచ్చుకు పోయిన పార్టీగా మిగులుతుంది. తెలుగుదేశంమీద నెగిటివ్ ఏటిట్యూడ్ పక్కన పెట్టి పాజిటివ్ గాసైలెంట్ గా కృషి చేస్తే వచ్చే ఎన్నికల నాటికి అత్యంత శక్తివంతమైన పార్టీగా రూపొందే అవకాశం వుంది.
లేని పక్షంలో మరో ప్రత్యామ్నాయం లేక చచ్చినట్టు తెలుగుదేశాన్నే ఎన్నుకోవలసిన అగత్యాన్ని ప్రజల ముందుకి నెట్టే రాజకీయ శక్తుల్లో బిజెపి కూడా వుండిపోతుంది.అంటే తెలుగుదేశం ఏకు మేకైపోవడమా లేదా అన్నది బిజెపి రాష్ట్ర శాఖ చేతుల్లో కూడా వుంటుందన్న మాట!