తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు సీరియస్గా కనిపించినా.. అప్పుడప్పుడు ఫుల్ జోష్ మీద జోకులేస్తూంటారు. వాళ్లు తరచుగా చెప్పే జోక్… వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పడమే. అది కూడా.. కాన్ఫిడెంట్గా చెప్పరు. ఎవరినో బెదించేందుకన్నట్లుగా చెబుతూంటారు. ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు అలా చెబుతున్నారంటే.. తెలుగుదేశం పార్టీని బ్లాక్మెయిల్ చేసేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారులే అనుకోవచ్చు. కానీ టీడీపీ పూర్తిగా తెగదెంపులు చేసేసుకుంది. తెలంగాణలో బీజేపీతో కనీసం కలసి నడిచేందుకు కూడా ఇప్పుడు ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా లేదు. అయినా ఎవర్నో బెదిరించడానికన్నట్లో… లేకపోతే.. పొత్తుల కోసం వాళ్ల దగ్గరకు ఎవరెవరో వస్తున్నట్లో బిల్డప్ ఇచ్చుకుంటూ ఒంటరి పోరు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన సమావేశంలో పాల్గొన్న తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఈ విషయాన్ని పాయింటవుట్ చేసి మరీ చెప్పారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలకు అక్షరాలా అంటరాని పార్టీనే. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇతర పార్టీలన్నీ కాంగ్రెస్ నేతృత్వంలో ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి కానీ… బీజేపీ అనే ఆలోచన కూడా రానీయడం లేదు. లెఫ్ట్ పార్టీలు, కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి కూడా.. కాంగ్రెస్ వైపే చూస్తున్నాయి కానీ…బీజేపీని దగ్గరకు రానివ్వాలని అనుకోవడం లేదు. అంతెందుకు.. జాతీయ స్థాయిలో బీజేపీకి రహస్య మిత్రుడిగా చెలామణి అవుతున్న కేసీఆర్ కూడా… అలాగే ఉండాలనుకుంటున్నారు కానీ… బీజేపీతో పొత్తు అనే ఆలోచన కూడా రానీయడం లేదు. కావాలంటే పార్లమెంట్ సీట్లలో గెలిచి… మద్దతిస్తాం కానీ…తెలంగాణలో మాత్రం పొత్తు అనే ఆలోచనే వద్దంటారు కేసీఆర్. ఎందుకంటే.. మైనార్టీ ఓట్ల కోసం… ఆయన పడుతున్న తాపత్రయం చూస్తేనే.. దీనిపై క్లారిటీ వస్తుంది.
తెలుగుదేశం పార్టీని బీజేపీనే వద్దనుకుంది. ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు అసలు అసాధ్యమన్నట్లుగా పరిస్థితులు మారాయి. కావాలంటే.. టీడీపీ పొత్తులు పెట్టుకోవాలంటే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ వైపు చూస్తుంది కానీ బీజేపీ వైపు చూడదు. ఇక బీజేపీతో కలసి పోటీ చేయడానికి ఎవరు వస్తారు..?
ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవగాహనతో మాట్లాడుతున్నారో… లేక రాజకీయ చాణక్యం చూపిస్తున్నారని భావిస్తున్నారో కానీ… ఆయన అమాయకత్వం మాత్రం బయటపడుతుంది. తెలంగాణలో అందరూ అమ్మో.. బీజేపీ అనుకునే పరిస్థితి. అయినా…. ఒంటరి పోరంటూ… లక్ష్మణ్ పొలిటికల్ కామెడీ బాగానే చేస్తున్నారు.