బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం కారణంగా వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీపై మరింత ఒత్తిడి పెరుగుతుందని చెప్పవచ్చును. రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన ఎన్.ఆర్.ఐ. డా. దేవయ్యను బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించడంతోనే బీజేపీ తప్పటడుగు వేసిందనే అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. మిత్రపక్షమయిన తెదేపాలోను అసంతృప్తి నెలకొని ఉందని కానీ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తూ బీజేపీ అభ్యర్ధి విజయానికి తామంతా కృషి చేస్తామని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పడం గమనిస్తే బీజేపీ అభ్యర్ధి పరిస్థితి అర్ధమవుతుంది.
రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర దుర్ఘటన, రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం, ఆయన స్థానంలో వరంగల్ ప్రజలకు పెద్దగా పరిచయం లేని సర్వే సత్యనారాయణ పోటీ చేస్తుండటం వంటివన్నీ అధికార తెరాసకు సానుకూలంగా మారాయని చెప్పవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీయే తరపున బలమయిన మంచి రాజకీయ అనుభవం, ప్రజాధారణ ఉన్న అభ్యర్ధిని నిలబెట్టి ఉండి ఉంటే, ఈ పరిణామాలన్నీ ఎన్డీయే అభ్యర్ధికి కూడా సానుకూలంగా మారేవి. కానీ అసలు రాజకీయాలతో, జిల్లా ప్రజలతో బొత్తిగా పరిచయం లేని డా. దేవయ్యను నేరుగా లోక్ సభ ఉప ఎన్నికలలో పోటీ చేయించడంతో అది కూడా తెరాసకు మరో కలిసి వచ్చే అంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం పొందడంతో తెరాసకు మరింత కలిసివచ్చినట్లయింది. వరంగల్ ఉప ఎన్నికలలో మోడీ పేరు చెప్పుకొనే బీజేపీ అభ్యర్ధి ప్రజలను ఓట్ల కోరవలసి ఉంటుంది. కానీ బిహార్ ఓటమి నేపధ్యంలో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక తెలంగాణా బీజేపీ నేతలు తమ అభ్యర్ధి విజయానికి మరింత ఎక్కువగా చెమటోడ్చవలసి వస్తుంది. కానీ ఈ పరిణామాలన్నీ కలిపి చూసినట్లయితే ఈ ఉప ఎన్నికలలో కూడా బీజేపీ నష్టపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.