రాష్ట్రాలన్నీ కాషాయికరణ చేయాలన్నది భాజపా రాజకీయ లక్ష్యం. దీన్లో భాగంగా రాష్ట్రానికో వ్యూహం అమలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయమై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది భాజపా అధినాయకత్వం. ఇప్పటికే తెలంగాణలో భాజపా కార్యకలాపాలు పెరిగాయి. గతం కంటే కాస్త ఉత్సాహంగానే రాష్ట్ర నేతలు కేసీఆర్ సర్కారుపై పోరాట స్వరం పెంచారు. ఉద్యమాలనీ, ధర్నాలనీ, యాత్రలనీ… ఇలా చాలా అవకాశాలు సృష్టించుకుంటున్నారు. అంతేకాదు, ఇంకోపక్క ఇతర పార్టీల నుంచి టి. భాజపాలోకి నాయకుల్ని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. తెలంగాణలో ఇంత యాక్టివిటీ జరుగుతుంటే.. ఆంధ్రా విషయంలో మాత్రం భాజపా ఇంకా గందరగోళ పరిస్థితిలోనే ఉందేమో అనే అనుమానం కలుగుతోంది. ఏపీలో ఏ విధంగా ముందుకు వెళదాం అనేది ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపించడం లేదు. అన్నిటికీమించి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేదే ఇప్పటికీ ఓ స్పష్టమైన నిర్ణయానికి రానట్టుగానే ఉందని చెబుతున్నారు.
భాజపా ఏపీ అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు బాధ్యతలు అప్పగించడం మంచిదనే అభిప్రాయం జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి కలిగిందని కొంతమంది భాజపా నేతలు చెబుతున్నారు. అయితే, రాష్ట్ర నేతలు ఎదురుచూస్తున్న స్పష్టత ఇది మాత్రమే కాదు! అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా పెద్ద తేడా ఉండదు. ఇంతకీ, ఏపీలో భాజపా పోషించాల్సిన పాత్ర ఏంటనేది స్పష్టత కావాలనేది రాష్ట్ర నేతల ప్రధాన డిమాండ్. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామా, లేదా సొంతంగానే ముందుకు సాగుతామా అనేది తేల్చాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర నేతల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇంకోపక్క, జనసేన పార్టీతో కూడా భాజపా ఎలాంటి సంబంధాలు నెరపాలనేది కూడా స్పష్టత కావాలని అంటున్నారు. ఈ అంశాలపై ఏ స్పష్టత ఇవ్వకుండా రాష్ట్రంలో పార్టీ సొంతంగా ఎదిగేందుకు కృషి చేయండీ అని ఆదేశిస్తే క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది.
నిజానికి, ఆంధ్రాలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదిగే ప్రయత్నాలు ఇంతవరకూ చేయలేదనే చెప్పాలి. గడచిన మూడేళ్లలో కూడా తెలుగుదేశం చాటు రాజకీయాలే చేసింది. కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నంత కాలం ఏపీలో భాజపాకి సొంత ఎదుగుదల ఉండదనే విమర్శలు కూడా అప్పట్లో ఉండేవి. సరే, ఇప్పుడు ఆయన ఎలాగూ వేరే బాధ్యతలతో పక్కకు తప్పుకున్నారు. ఏపీలో సొంతంగా భాజపా ఎదగాలంటే ఇప్పుడు ఏం చేయాలి..? చంద్రబాబు సర్కారుపై పోరాటాలు సాగించాలా..? లేదంటే, వైకాపాను దగ్గర చేర్చుకోవాలా..? మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే జనసేన వంటి పార్టీలతో జత కట్టాలా..? అన్నిటికీ మించి సామాజిక వర్గాల సమీకరణల పరిస్థితి ఏంటి..? కన్నాకు అధ్యక్ష పదవి ఇచ్చినంత మాత్రాన సరిపోతుందా..? ఇప్పుడున్న నేతలతోపాటు ఇతర పార్టీల నుంచి నేతల్ని ఆకర్షించే వ్యూహమేంటీ..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ముందుగా రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం భాజపా వర్గాల నుంచే వినిపిస్తూ ఉండటం విశేషం. మరి, వీటిపై భాజపా అధినాయకత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుందో వేచి చూడాల్సిందే.