ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు పూర్తి రాజకీయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. తాము పార్టీ పరంగా బలపడాలనే ఆరాటంతో.. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఘాటు ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. ఢిల్లీ పార్టీ అభిప్రాయాన్ని మాత్రం వారు కనిపెట్టలేకపోతున్నారు. ఫలితంగా.. వారు డబుల్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలకు గురి కావాల్సి వస్తోంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నేతలు వైసీపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి ఫేవర్‌గా ఉండే కొద్ది మంది నేతలు సైలెంట్ గా ఉన్నారు కానీ.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ …కాబోయే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రేసులో ముందున్న ఎమ్మెల్సీ మాధవ్… మరో యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి సహా.. అందరూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నవారే. అయితే.. వారు ఏ ఏ అంశాలపై విరుచుకపడుతున్నారో… వాటికి సంబంధించి… కేంద్రం నుంచి.. వైసీపీ కి అభయం లభిస్తోంది. స్మూత్‌గా పనులు పూర్తయ్యేలా చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. తమ క్యాడర్‌పై దాడులు చేశారని చెప్పుకున్నారు. అమిత్ షాను కలిశారు. లేఖలు కూడా ఇచ్చారు. చివరికి కరోనా కారణంగా.. ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేస్తే.. ఆయనను తొలగించేందుకు కేంద్రం సహకరించింది. దీంతో బీజేపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. కేంద్రం సహకారం.. లేకపోతే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం సాధ్యం కాదు. ఎందుకంటే.. అది గవర్నర్ చేపట్టాల్సిన నియామక ప్రక్రియ. గతంలో చంద్రబాబు బిశ్వాల్ అనే అధికారిని నియమించాలనుకున్నప్పటికీ.. అప్పటి గవర్నర్ పట్టుబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించారు. ఆయన చేతుల్లోనే అంతా ఉంది. ఇప్పుడు… రాజ్యాంగ విరుద్ధంగా ఓ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకు రావడం ఆలస్యం.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. గవర్నర్ దానిని ఆమోదించారు.
వెంటనే.. కొత్త కమిషనర్ ను నియమిస్తూ.. ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక్కడే.. కేంద్రం..వైసీపీకి ఎంత బాగా కోపరేట్ చేస్తుందో అర్థమైపోతుంది. రమేష్ కుమార్ తొలగింపుపై.. బీజేపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా వారు.. వైసీపీతో కలిసి .. డబుల్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిజంగా బీజేపీ నేతలకు.. ఢిల్లీ బీజేపీ స్టాండ్ ఏమిటో తెలియదా.. లేక తెలిసినా.. తెలియనట్లు రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచైనా.. ఢిల్లీ బీజేపీ నేతల ఆలోచనలు తెలుసుకుని.. వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉంటే.. కనీసం.. ప్రజల్లో చెడ్డ పేరన్నా రాకుండా ఉంటుందనే సూచనలు పార్టీ సానుభూతిపరుల దగ్గర్నుంచి వస్తున్నాయి.