ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు వైసీపీ నేతల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగుతున్న కొన్ని పరిణామాలు వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం వెనుక బీజేపీ ఉందనే ప్రచారంతో పాటు.. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ కూడా.. పై స్థాయి ప్రమేయం లేకపోతే.. బయటకు రాదని అనుకుంటున్నారు. రమేష్ కుమార్ లేఖ.. ఢిల్లీ నుంచే బయటకు వచ్చిందన్న అనుమానం.. వైసీపీ నేతల్లో బలపడుతోంది. దీనికి కారణం… అలా లేఖ బయటకు రాగానే.. ఇలా.. సీఎస్‌కు.. కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. రమేష్‌కుమార్‌కు సెంట్రల్ ఫోర్స్‌లతో భద్రత కల్పించడమే కాదు.. ఆయన.. హైదరాబాద్ నుంచి విధులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేశారు. అలాగే.. ఎస్ఈసీ లేఖపై గవర్నర్ ఇలా అధికారులను పిలిపించి మాట్లాడారు.
సీఎంవో అధికారులు కూడా రాజ్ భవన్ కు వెళ్లటం కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ వెనుక కేంద్రంలోని కొంతమంది కీలక నేతల అండ ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. లేనిపక్షంలో ఎన్నికల కమిషనర్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోరని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో.. ముగ్గురు బీజేపీ ఎంపీలు నేరుగా అమిత్ షాను కలిసిన తర్వాత.. కన్నా లక్ష్మినారాయణ లేఖలు రాయడం.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిపోతున్నాయి.
చివరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని లేఖ రాసిన గంట వ్యవధిలోనే ఇదే డిమాండ్ తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి కమిషనర్ రమేష్ కుమార్ కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. ఆ తర్వాత వెంటనే భద్రత కల్పించారు. ఈ సంఘటనలన్నిటినీ పరిశీలిస్తే కేంద్రం ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం ప్రారంభించిందని అన్ని పార్టీల నేతలకు ఓ క్లారిటీ వచ్చింది. వైసీపీ అగ్రనాయకత్వానికి కూడా అదే అనుమానం ప్రారంభమయింది. కానీ బీజేపీని ఏమీ అనలేక.. టీడీపీపై కుట్ర సిద్ధాంతం వినిపిస్తున్నారు.