తెలంగాణ బీజేపీ రాను రాను కాన్ఫిడెన్స్ కోల్పోతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇది చేరికల ప్రభంజనం.. అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారు కానీ.. పనికొచ్చే నేతలు ఎవరూ చేరడం లేదు. దీంతో నాయకత్వ సమస్య తీరడం లేదు. తాజాగా తెలంగాణ బీజేపీ నేతలు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అదేమిటంటే.. మోదీని తెలంగాణ నుంచి పోటీచేయమని కోరుతారట. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మహబూబ్‌నగర్ లో సోమవారం నుంచి జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో మోదీని పాలమూరు నుంచి పోటీ చేయాలని ప్రధాని మోడీని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతంచేయడం ఎలా..?, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి..?, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేయాల్సిన పోరాటాలు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇవన్నీ జరగాలంటే మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయాలన్నట్లుగా వారి తీరు ఉంది.
ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రధాని మోడీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కోరినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరుకు ఓ వైపు కర్ణాటక, మరోవైపు ఏపీ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండడం, తమిళనాడుకు కూడా సులువుగా యాక్సెస్ చేసే వీలు ఉండడంతో పాలమూరు ఎంపీ స్థానం ప్రాధాన్యత సంతరించుకుందని బీజేపీ చెబుతోంది. అయితే ఇదంతా పై నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి తెలంగాణ బీజేపీ నేతలు ఆడుతున్న గేమే కానీ.. మోదీ , షాలు పోటీ చేయడం సాధ్యం కాదని వారికీ తెలుసని .. ఇతర బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.