తెలంగాణ బీజేపీలో రాష్ట్ర నాయకత్వం – ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం బీజేపీని చిక్కులో పడేసింది. మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ ఆ పార్టీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేయడం బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. కారణం..ఆ కంపెనీ చేతుల్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఉండటమే. అయినా ఈ విషయం గుర్తించని నేతలు.. మేఘాను కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తుండటంపై తాజాగా రాష్ట్ర నాయకత్వం పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మేఘా సంస్థపై ఎవరూ విమర్శలకు దిగవద్దని, ఈ విషయంలో మౌనంగానే ఉండాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేఘాపై విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ ను ఇరుకునపెట్టే అవకాశం ఉన్నా, అది బీజేపీకి నష్టాన్ని తెచ్చి పెట్టేలా ఉందని గుర్తించి నష్టనివారణ చర్యలకు బీజేపీ దిగిందనట్లుగా కనిపిస్తోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో మేఘా అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో టన్నెల్ నిర్మాణ పనులు మేఘా చేపడుతోంది. అయితే, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేయడంతో బీజేపీని , కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం అవుతుంది.
మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టాలని మాట్లాడుతోన్న బీజేపీ నేతలు..కేంద్ర ప్రాజెక్టులను మేఘాకు ఎందుకు అప్పగించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తే ఆ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అవుతుంది. అందుకే రాష్ట్ర నాయకత్వం మేఘాపై సైలెంట్ గా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించిందని అంటున్నారు.