భారతదేశ కొత్త ప్రజాస్వామ్యంలో లోక్ సభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ అద్భుతాన్ని నమ్మి తీరాల్సిందే. అదీ కూడా మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో. సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థులూ ఉపసంహరించుకున్నారు. బరిలో ఒక్క బీజేపీ అభ్యర్థి మాత్రమే నిలిచారు. దీంతో ఆయనకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా పత్రం ఇచ్చేశారు.
సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నీలేశ్ కుంభానీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నీలేశ్ కుంభానీ వేసిన నామినేషన్ను జిల్లా రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. నీలేశ్ కుంభానీని ప్రతిపాదిస్తూ నామపత్రాల్లో ముగ్గురు వ్యక్తులు చేసిన సంతకాల్లో తేడాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. అదే సమయంలో ఇదే సూరత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన మరో అభ్యర్థి సురేశ్ పాద్సాలా దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లోని సంతకాల్లో కూడా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరూ కలిసి మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. వాటిని తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
సూరత్ నియోజకవర్గం పోటీలో ఉన్న మరో 8 మంది అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఏడుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాగా.. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్యారెలాల్ భర్తీ కూడా తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ తరఫున పోటీలో ఉన్న ఒకే ఒక్క అభ్యర్థి ముకేశ్భాయ్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవం అయ్యారు.