ఊహించినట్టుగానే జరిగింది…! కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకే అవకాశం ఇస్తూ గవర్నర్ విజుభాయ్ ఆహ్వానం పలికారు. దీంతో గురువారం ఉదయం ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బలనిరూపణకు 15 రోజులు గడువు ఇస్తారట. స్వతంత్ర అభ్యర్థితో కలిపి భాజపాకి ఉన్న సంఖ్యాబలం 105 మాత్రమే. ఇంకోపక్క, కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలం 116. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కూడా భాజపా దగ్గర లేదు. అలాంటప్పుడు, భాజపాకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ ఎలా ఇచ్చారు..? భాజపాకి పరిపూర్ణ మెజారిటీ లేదని కనిపిస్తున్నా, కూటమికి స్పష్టమైన సంఖ్యాబలం ఉందని తెలుస్తున్నా… ఏ లెక్క ప్రకారం భాజపా బలనిరూపణ చేసుకోగలదు..? అత్యధిక స్థానాలు గెలుచుకున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి, ముందుగా భాజపాకి అవకాశం ఇవ్వడం సరైందా..?.
కర్ణాటక ఎన్నిక ఫలితాలకు వచ్చేసరికి తమకు అనుకూలంగా భాజపా రూల్స్ మార్చేసింది..! కానీ, అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే… మణిపూర్ లో ఏం జరిగింది..? భాజపాకి 21, కాంగ్రెస్ కి 28 వచ్చినా… భాజపా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది..? గోవాలో కూడా భాజపాకి 13, కాంగ్రెస్ కి 17 వస్తే… అక్కడా వారే ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేశారు..? మేఘాలయలో భాజపాకి కేవలం 2 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కి 21 వచ్చినా కూడా భాజపాయే అధికారంలోకి ఎందుకొచ్చింది..? మరి, ఈ రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు దక్కించుకున్న సింగిల్ పార్టీకి బలనిరూపణ అవకాశం ఎందుకు ఇవ్వనట్టు..? కర్ణాటక రూల్ అక్కడ వర్తించలేదా..? అధికారం కోసం ఎక్కడికి అనుగుణంగా అక్కడ రూల్స్ మార్చేసుకుంటారా..? వ్యవస్థను భ్రష్టుపట్టించడంలో తాము కూడా ఏమాత్రం తీసిపోమని భాజపా నిరూపించుకుంటోంది.
ఇక, గవర్నర్ పాత్ర ఈ సందర్భంగా అత్యంత విచారకం. రాజ్యాంగం ప్రకారం… ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి తన మంత్రి మండలిని నియమిస్తారు. అయితే, కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వం, శాసన సభ మద్దతు పొందుతుందా లేదా అనేది గవర్నర్ చూడాలి. ఒకవేళ ఆ మద్దతు అస్పష్టంగా ఉంటే.. తనకున్న విచక్షణాధికారాలతో గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు. కర్ణాటకలో ఆ పరిస్థితి లేదు కదా. రెండు గుర్తింపు పొందిన పార్టీలు, కాంగ్రెస్ – జేడీఎస్ లు కూటమిగా ఏర్పడి, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తమ దగ్గర ఉందని గవర్నర్ కి చెప్పినా ఆయన పట్టించుకోలేదు. విడిగా చూసుకున్నప్పుడు భాజపాకి అతిపెద్ద సంఖ్యాబలం ఉన్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య కాదది. ఆ విషయం గవర్నర్ కు తెలుసు కదా! అలాంటప్పుడు, భాజపా బలనిరూపణ ఎలా చేసుకుంటుంది..? అంటే, ఫిరాయింపులను దగ్గరుండి ప్రోత్సాహిస్తున్నట్టా..?
ఇప్పుడు భాజపా చేస్తున్నదేంటీ… తమకు అదనంగా కావాల్సిన సభ్యుల వేటలో ఉంది. కాంగ్రెస్ లేదా జేడీఎస్ సభ్యులను భాజపా ఆకర్షించే పనిలో పడింది. ఓ పదిమందిని కొనేస్తే పోలా, ప్రభుత్వం మనదేగా అనే ధీమా భాజపాకి ఉండొచ్చు. కానీ, కాంగ్రెస్ లేదా జేడీఎస్ సభ్యులు ఆయా పార్టీల విప్ కి విరుద్ధంగా ఎవరికి పడితే వారికి మద్దతు ఇచ్చేస్తామని చేతులు ఎత్తేసే హక్కు వారికి ఉండదు. పార్టీ నాయకత్వం జారీ చేసిన విప్ కి అనుగుణంగానే ఓటెయ్యాలి. పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం అనేది ఒకటి ఉందనేది చాలామంది మరచిపోతున్నారు. కాబట్టి, గవర్నర్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే… మెజారిటీ సభ్యుల మద్దతున్న కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి. అదీ పద్ధతి. కానీ, అందుకు విరుద్ధంగా విజూభాయ్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే, దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అధికారం కోసం ఏదైనా చెయ్యొచ్చనే ఒక దుష్ట సంప్రదాయాన్ని భాజపా పెంచి పోషిస్తోంది. ప్రజాతీర్పును వెక్కించే విధంగా మరో రాష్ట్రంలో అధికార సాధన నాటకానికి తెర లేపింది. విలువలతో కూడిన రాజకీయం అంటే ఇదేనన్నమాట.