బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దాదాపుగా ప్రతీ రోజు బెంగళూరు డ్రగ్స్ కేసు గురించి చెబుతున్నారు. తాజాగా బీజేపీ నెంబర్ త్రీగా భావిస్తున్న బీఎల్ సంతోష్ కూడా ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. అసలు ఆ కేసు ఏంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది ఫిబ్రవరిలో శంకరగౌడ అనే సినీ నిర్మాత బెంగళూరులో డ్ర్గగ్స్ పార్టీలు ఇస్తున్నట్లుగా కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ప్రశ్నిస్తే చాలా మంది తెలంగాణ నేతల పేర్లు బయటకు వచ్చాయి.
ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ముగ్గురు శాసనసభ్యుల పేర్లు బెంగళూరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కాయని కూడా చెప్పుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్నారు. డ్రగ్స్ పార్టీలు జరిగిన సమయంలో ఆ ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నట్లు కొన్ని సాంకేతిక ఆధారాలు కూడా సేకరించారని అక్కడి మీడియా వెల్లడించింది. కానీ ఆ కేసు తరవాత చల్లబడిపోయింది.
ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తమను మోసం చేసినందున పగ తీర్చుకోవాలని.. ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తామని బండి సంజయ్ చెబుతున్నారు . అయితే కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగా ఇలాంటి కేసుల్ని రీ ఓపెన్ చేయించి రాజకీయంగా ఇబ్బందిపడే ఆలోచనలు చేయకపోవచ్చని అక్కడి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బండి సంజయ్ మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆ కేసు రీ ఓపెన్ అయితే.. కర్ణాటక వర్సెస్ తెలంగాణ అనే సీన్ ప్రారంభమవడం ఖాయం.