మోదీ పర్యటన నల్ల బెలూన్లు ఎగురవేయడం సంచలనం సృష్టిస్తోంది. ఓ వైపు ప్రధాని హెలికాఫ్టర్ గాల్లోకి ఎగిరితే మరో వైపు బెలూన్లు సమాంతరంగా ఎగిరాయి. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి ప్రధాని పర్యటన అంటే.. పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. రాజకీయ నిరసనలపై ముందస్తుగానే ఆరా తీస్తారు. అయితే అలా తీసేది ఎక్కువగా రాష్ట్ర పోలీసుల నుంచే. స్టేట్ ఇంటలిజెన్స్ పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఏపీలో మోదీ రాకకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదు. కానీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. దీంతో కలకలం బయలుదేరింది. అయితే ఆయన నిరసనలు నిర్వహించాలో లేదో స్పష్టత లేదు. కానీ నల్ల బెలూన్లు మాత్రం గాల్లోకి ఎగిరాయి. కాంగ్రెస్ నేతలే ఈ బెలూన్లు ఎగురవేశారని పోలీసులు చెబుతున్నారు. కానీ వారు అలా చేస్తారని తెలిసి కూడా చూసీ చూడనట్లుగా వదిలేశారన్న విమర్శలు పోలీసులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాని పర్యటనలో భద్రతాలోపం అని విస్తృతంగా ప్రచారం జరగడంతో.. పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఎలాంటి భద్రతా లోపం లేదని ఐదు బెలూన్లు ఎగరేస్తే భద్రతా లోపం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎస్పీజీ మాత్రం సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఎంత ఉందో ఆరా తీస్తున్నారు. అందుకే ఉన్నతాధికారులు కంగారు పడుతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు, పోలీసులు సీరియస్గా ఉంటే.. ఈ బెలూన్ల వ్యవహారం చోటు చేసుకుని ఉండేది కాదని అంటున్నారు.