ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటిదాకా ఎక్కువ కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేసేది. అంటే ఆ జీవోల్లో ఏముందో రహస్యం అన్నమాట. చేయాల్సినదంతా చేసేసిన తర్వాత వాటిని బహిరంగ పరిచేవారు. అయితే ఇప్పుడు కొత్తగా బ్లాంక్ జీవోల బాట పట్టారు. అంటే.. జీవో ఇష్యూ అవుతుంది కానీ అందులో ఏమీ ఉండదు. బ్లాంక్‌గా ఉంటుంది. ఆ జీవో నెంబర్ కూడా ఉంటుంది. అందులో ఏ వివరాలు ఉన్నాయి…అసలు కథేంటో ఎవరికీ తెలియదు. ఇలాటి బ్లాంక్ జీవోలు ఒక్క సారిగా కుప్పలు తెప్పలుగా విడుదల చేశారు. నిన్న సాధారణ పరిపాలనా శాఖ నుంచి విడుదలైన జీవోల్లో 90శాతం ఇలాంటి బ్లాంక్ జీవోలే. నిజానికి జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా ఉంచడంపై చాలా సార్లు న్యాయస్థానాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అయినా ప్రభుత్వం కొత్తగా బ్లాంక్ జీవోలను కూడా రంగంలోకి తీసుకు వచ్చింది. సాధారణ పరిపాలనా శాఖలో వచ్చే జీవోలు ఎక్కువగా నియామకాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. ఇలా రాజకీయ నియామకాలు చేపట్టి ఉంటారని .. విమర్శలు వస్తాయని మీడియాలో కవరేజీ వస్తుందన్న కారణంగా వాటిని బ్లాంక్‌లో పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ముగ్గురు రాజకీయా నేతలకు సభ్యులకు పదవులు ఇచ్చారు. అలాగే ఎంపీ అనురాధ భర్త ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి. కొత్తగా ఆయనకు కూడా పోస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి నియామకాలన్నీప్రజల దృష్టిలో పడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని… విమర్శలు వస్తాయన్న కారణంగానే వాటిని బ్లాంక్‌గా ఉంచారని అంచనా వేస్తున్నారు. ప్రజలకు తెలిసి చేయాల్సిన నిర్ణయాలన్నింటినీ ఇలా రహస్యంగా ఉంచి అమలు చేసేసి.. అమలు చేస్తున్న సమయంలో ప్రజలకు తెలియడం…సాధారణంగా మారిపోయింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలే కాదు మాజీ ఉన్నతాధికారులు కూడా విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం తీరులో పెద్దగా మార్పు ఉండటం లేదు.