ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి సునీత.. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసుల తీరును అనుమానించడం.. స్వయంగా డీజీపీ గౌతంసవాంగ్ వ్యవహారశైలిని సందేహించడం.. సంచలనం రేకెత్తిస్తోంది. పోలీసులు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారన్న టీడీపీ విమర్శలు ఓ రేంజ్లో ఉండగానే.. ఓ హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు కూడా.. పోలీసులు వెనుకాడటం లేదన్న ఆరోపణలు ఎదుర్కోవడం..అదీ కూడా ఓ హైప్రోఫైల్.. ముఖ్యమంత్రి బాబాయ్ కుటుంబమే బాధితులు అయినప్పటికీ.. కేసును తేలకుండా చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. హైకోర్టులో సునీత దాఖలు చేసిన రిట్ పిటిషన్లో డీజీపీ తీరుపై కొన్ని కీలకమైన అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇప్పటికి వివేకా హత్య కేసుపై మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక దాని తర్వాత ఒకటి ఏర్పాటు చేసిన సిట్ల వల్ల.. విచారణ వేగం మందగించింది. ఇప్పుడు అసలు ఎలాంటి విచారణ జరగడం లేదు. అదే సమయంలో.. నిందితులుగా ఉన్న కొంత మంది.. డీజీపీని కలిశారని.. అలా కలిసిన తర్వాతే.. వారిపై విచారణ ఆగిపోయిందని.. కూడా.. సునీత ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై తాను డీజీపీని ప్రశ్నించినప్పటికీ.. సరైన సమాధానం రాలేదని.. సునీత రిట్ పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. రిట్ పిటిషన్లో సునీత కొంత మంది అనుమానితుల పేర్లు.. వారిని ఎందుకు అనుమానించాలో స్పష్టంగా రాశారు. ఎలాంటి పోలీసు వ్యవహారాలకు.. సంబంధం లేదని సునీతక వ్యక్తం చేసిన ఆ అనుమానాలను చూస్తే. . హంతకులు ఎవరో.. ఆ కుట్రేమిటో స్పష్టంగా బయట పెట్టడానికి రెండు, మూడు రోజులు సరిపోతుంది. సీఐడీ అనే సీరియల్‌ను రెగ్యులర్ గా చూసే… ప్రేక్షకుడు కూడా వారంలో కేసు చేధించగలడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది.
వివేకా హత్య కేసు జరిగిన విధానం, సాక్ష్యాలను తుడిచేయడం, హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం… ఇలా అన్ని క్లూలు ఉన్న పోలీసులు… హత్య కేసును చేధించలేకపోవడం అనేది ఆశ్చర్యకరం. కావాలనే పోలీసులు .. నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు సామాన్యుల్లోనూ కలుగుతున్నాయి. ఇప్పుడు డీజీపీనే స్వయంగా.. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదీ కూడా.. వివేకా కుమార్తె నుంచే ఎదుర్కొంటున్నారు. గతంలో సిన్సియర్ అధికారిగా పేరున్న గౌతం సవాంగ్.. డీజీపీ అయిన తర్వాత మాత్రం.. అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతపై చెప్పులు, రాళ్లు వేయడాన్ని నిరసనలుగా చెప్పుకున్న ఆయన.. శాంతి యుత నిరసనలు చేస్తున్న మహిళలపై విచ్చలవిడి లాఠీచార్జ్ కు పర్మిషన్ ఇచ్చారు. ఆ సిన్సియార్టీ.. వివేకా హత్య కేసు దర్యాప్తుల్లో చూపించడం లేదు. నిందితుల్ని కాపాడేందుకు తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.