పదివేల కోట్ల నల్లధనం ప్రకటించిన ఆ బ్లాక్ మిలియనీర్ ఎవరనేది ఆంధ్రాలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అది ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డికి చెందిన సొమ్మే.. అని తెలుగుదేశం ఒక స్టాంప్ వేసేసింది. ఆ కుబేరుడు ఆయనే అంటూ విమర్శలు చేసింది. ప్రతిపక్షం వైకాపా కూడా తగ్గలేదు. ఆ బ్లాక్ మనీ చంద్రబాబు అనుచరుడిది అంటూ జగన్ మరో కొత్త వాదన తెరమీదికి తెచ్చారు. ఆ నల్లధనవంతుల వివరాలు బయటపెట్టాలని కూడా ప్రధానికి లేఖ రాశారు. అంతేకాదు, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని స్వయంగా కలిసి ఇదే విషయమై మాట్లాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ తరుణంలో ఆ నల్లధన కుబేరుడు ఎవరంటూ అన్ని వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది.
అంత మొత్తంలో బ్లాక్‌ను వైట్ చేసుకున్నది ఆదికేశవుల నాయుడే అనే అనుమానాలు ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ సొమ్ము ఆయనదే అయి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇటీవలే ఆయన భార్య, చిత్తూరు శాసన సభ సభ్యురాలు సత్యప్రభ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో ఈ ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఉందనీ, ఆయన స్వదేశీ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టి దేశాన్ని దాటేస్తున్న సందర్భంగా ఈ ఫ్యామిలీ దగ్గర కొంత సొమ్ము దాచుకున్నారని అనుమానించారు. ఆ కోణంలో ఐటీ దాడుల జరిగాయనీ, పెద్ద ఎత్తున ఆస్తులు దొరికాయని కథనాలు వచ్చాయి. అంతేకాదు, ఈ ఫ్యామిలీ నడుపుతున్న కాలేజీలో కూడా పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ లభించిందనీ అన్నారు. కాబట్టి, ఆంధ్రాలో హాట్ టాపిక్‌గా మారిన ఆ నల్లధనవంతుడు ఆదికేశవుల నాయుడే అయి ఉంటారని వాణిజ్య వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే ఈ విషయంలో తెలుగుదేశం సెల్ఫ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇన్నాళ్లూ ఆ నల్లధనవంతుడు జగనే అంటూ దేశం వెలెత్తి చూపింది. ఇప్పుడు, అది తెలుగుదేశం పార్టీకి చెందినవారిదే అనే ప్రచారం మొదలైంది. ఈ తాజా ప్రచారాన్ని వైకాపా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా, ఈ బ్లాక్ మనీ గొడవ ఇప్పట్లో సద్దుమణిగేట్టుగా లేదు. కొత్తకొత్త పేర్లు తెరమీదికి వస్తున్నాయి!