ఎక్కడికో మొదలై చర్చ ఎక్కడికో వెళ్లిపోయింది! ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ – ఉప ముఖ్యమంత్రి ఫొటో ఇష్యూపై అధికార విపక్షాలు విమర్శల పర్వం కొనసాగుతోంది. లోకేష్‌పై బురద చల్లే ఉద్దేశంతోనే ఆ ఫొటో వెనక ఇంత రాజకీయం చేస్తున్నారంటూ దేశం నేతలు అభిప్రాయపడ్డారు. లోకేష్ సంస్కారవంతుడనీ, తనను ఏమీ అనలేదనీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన కుమారుడి క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆ తరువాత, ఏపీ మంత్రి దేవినేని ఉమ కూడా లోకేష్ క్యారెక్టర్‌కు సర్టిఫికేట్ ఇచ్చారు! అయితే, ఈ క్రమంలో ఫొటోపై మొదలైన చర్చ నల్లధనం మీదికి వెళ్లిపోయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… హైదరాబాద్‌లో రూ. 13 వేల కోట్ల నల్లధనం ఉందని ప్రకటించారు! ఒక వ్యక్తి దగ్గరే రూ. 10 వేల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది అన్నారు. ఈ రహస్యం ఆయనకి ఎలా తెలిసిందే ఏమో..? ఆ ఒక వ్యక్తి ఎవరనేది మధ్యాహ్నం అయ్యేసరికి మంత్రి దేవినేని ఉమ కన్ఫర్మ్ చేశారు. పెద్ద ఎత్తున నల్లధనాన్ని వైట్‌గా మార్చుకుంటున్నది విపక్ష నేత జగన్ అని ఆయన ఆరోపించారు. జగన్‌కు వేలాది ఎకరాల్లో అక్రమ గనులు ఉన్నాయని, ఆ పదివేల కోట్లూ జగన్‌దే అని ఆయన నిర్ధారించేశారు. దీంతో ఫొటోల దగ్గర మొదలైన చర్చ ఇలా నల్లధనం వైపు టర్న్ అయిపోయింది. ఓ వైపు ఫొటోల వార్ కొనసాగిస్తూనే వైకాపా సవాళ్లు విసురుతోంది.
నారా లోకేష్ విదేశాల్లో చదువుకుంటున్న రోజుల్లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోలకు జగన్ మీడియా సంస్థ వెబ్సైట్లో పెట్టింది. తాగుతూ, ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోల్లో ఉన్నది నారా లోకేష్ బాబే అనేది వారి ఆరోపణ. ఇంకోపక్క నల్లధనం ఆరోపణలపై కూడా వైకాపా సవాళ్లు విసురుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండున్నరేళ్ల కాలంలో రూ. 1.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుని దాంతో రూ. 20 నుంచి రూ. 30 కోట్లు ఎరగా వేసి 20 మంది వైకాపా ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలో కూడా నాయకుల్ని కొనుగోలు చేస్తూ చంద్రబాబు నాయుడు దొరికిపోయారని విమర్శించారు. ఆ పదివేల కోట్ల నల్లధనం తెలుగుదేశం పార్టీ వారిదేననీ, అందుకే ఆ విషయం వారికి మాత్రమే తెలిసిందని ఆరోపించారు. మరి, వైకాపా సవాళ్లకు తెలుగుదేశం ఎలాంటి బదులు ఇస్తుందో వేచిచూడాలి. మొత్తానికి… ఫొటోలు, నల్లధనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా మారిపోయాయి.