ప్రభుత్వం అంటే వ్యవస్థ. తన చేతుల్లోనే యంత్రాంగం ఉంటుంది. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించగల సామర్థ్యం.. అధికారం ఉంటుంది. కానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు నెలలుగా.. అనేక సమస్యలు సృష్టించుకుంటూ పోతోంది. కానీ పరిష్కారాలు మాత్రం లేవు. ప్రజలకు ఇప్పుడు.. ఉపాధి లేదు. వ్యాపారాలు పడిపోయాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఇదంతా అని..అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం వల్లే అంటూ.. సర్కార్ దీర్ఘాలు తీస్తోంది. ఇలా తీసి ఎవరికి ప్రయోజనం..? ప్రజల సమస్యలు తీరుతాయా..?
ఇసుక సమస్యకూ చంద్రబాబే కారణమట..!
ప్రభుత్వం ఇసుక సమస్యను పరిష్కరించలేక కిందా మీదా పడుతోంది. ఇదేమీ ఖర్చయ్యే సమస్య కాదు. ఆదాయం తెచ్చి పెట్టే వనరు. ఇసుక కొరత కారణంగా ప్రభుత్వ ఆదాయంపైనే తీవ్ర ప్రభావం పడిన సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికి.. మొదటగా కొత్త విధానం పేరుతో.. ఇసుక సరఫరాను నిలపివేసిన సర్కార్.. తీరా కొత్త విధానం పెట్టిన తర్వాత వరదలొచ్చాయనే కారణాలు చెబుతోంది. కానీ.. సరిపడా ఇసుకను మాత్రం అందించడం లేదు. ఈ ప్రభావం ప్రజలపై తీవ్రంగానే ఉంది. రోజువారీ కూలీలు అప్పులపాలయ్యారు. కొన్ని లక్షల మంది ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు పనుల కోసం వలస పోయారు. ఈ సీజన్లో పనులు ఉండవని మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. గత ఏడాది మే నుంచి అక్టోబర్ మధ్యలో… ఏపీలో నిర్మాణాలు పరుగులు పెట్టాయి. ఎక్కడా ఇసుక కొరత అనే మాటే వినిపించలేదు. కొత్త ప్రభుత్వానికి ఆ ముందు చూపు లేదు. దీని గురించి ప్రశ్నిస్తేనే ఘనత వహించిన మంత్రులు విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లే సమస్యని వాదిస్తున్నారు.
ఆదాయం పడిపోయే నిర్ణయాలకు చంద్రబాబే కారణం..!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు ఆదాయం పడిపోవడం.. నీతిఆయోగ్ ర్యాంకుల్లో దిగజారిపోవడం, బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు కూడా వెనుకాడుతూండటంతో.. ప్రభుత్వం .. పాలనా సామర్థ్యంపైనే అనుమానాలొస్తున్నాయి. దీనిపై కూడా.. టీడీపీనే తిట్టి సరిపెడుతున్నారు. గత ప్రభుత్వం.. తమకు అప్పులు ఇచ్చి పోయిందని.. ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి టీడీపీ సర్కార్కు,.. వచ్చింది అప్పులు, లోటు బడ్జెటే. మిగులు రాలేదు. టీడీపీ సర్కార్ సగటున ఏడాదికి రూ. 22వేల కోట్ల అప్పులు చేస్తే.. ప్రస్తుత సర్కార్ నాలుగు నెలల్లోనే రూ. 28వేల కోట్ల అప్పులు చేసింది. దీనికి కూడా చంద్రబాబే కారణం. ఐదు నెలల కిందటి వరకూ నిరంతర విద్యుత్ ఉన్న ఏపీలో ఇప్పుడు సంక్షోభం తాండవిస్తోంది. పీపీఏలను సమీక్షించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సౌర, విద్యుత్ కొనడం మానేయడంతో… బొగ్గు కష్టాలు వచ్చి పడ్డాయి. దీనికి గత ప్రభుత్వమే కారణంటున్నారు.
టీడీపీపై నిందలేస్తే ప్రజల కష్టాలు తీరుతాయా..?
ఐదు నెలులుగా తమ వైఫల్యాలు ఏమీ లేవని.. గత ప్రభుత్వం .. వల్లే ఇప్పుడు సమస్యలు వస్తున్నాయని చెప్పుకోవడం ద్వారా అధికారంలో ఉన్నవారికి ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే.. సమస్యలు పరిష్కరించి… జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తారనే ప్రజలు అధికారం ఇస్తారు. సమస్యల్లోకి నెట్టి సాకులు చెపితే.. అయ్యో.. పాపం అనుకునే పరిస్థితి ఉండదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదు… కానీ నిజాలను అంగీకరించలేక… మీడియా ప్రభుత్వ వైఫల్యాలన్నిటినీ ప్రజల ముందు ఉంచుతోందన్న అసహనంతోనే ఎదురుదాడి చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి మరో రకంగా వెళ్తోంది.