వివిఐపి సమక్షంలో జరిగేవాటికి నియమ నిబంధనలు అవసరం లేదనుకునే అధికారుల ఉదాసీనత వల్ల గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 28 మంది అన్యాయంగా చచ్చిపోయారు. అలాంటి ఉదాసీనతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వ్యాపిస్తోంది.
ఎట్టి పరిస్ధితుల్లోనూ గడువుకి ముందే పని అయిపోవాలి అని స్వయంగా ముఖ్యమంత్రే వారానికి ఒక సారి హెచ్చరించవచ్చు…అయినా కూడా చేసే పని చట్టబద్ధంగా, సురక్షితంగా పూర్తి చేయాలన్న బాధ్యత కాంట్రాక్టర్లకు వుండాలి…పని చట్టబద్ధంగా, సురక్షితంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న జ్ఞానం అధికార యంత్రాంగానికి వుండాలి. ఇవేమీ లేకపోవడం వల్లే తాత్కాలిక సెక్రెటేరియట్ నిర్మాణంలో ఇప్పటికే ఇద్దరు కార్మికులు అన్యాయంగా చచ్చిపోయారు. వందల మంది కార్మికులు చట్టవిరుద్ధమైన ఆంక్షల కింద మగ్గిపోతున్నారు.
తన కాంట్రాక్టులో వున్న తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణాన్ని ఎల్ అండ్ టి సంస్ధ మరో సంస్ధకు, ఆమరో సంస్ధ వేరొక సంస్ధకు సబ్ కాంట్రాక్టు ఇచ్చాయి. చట్ట ప్రకారం అరగంట భోజన విరామం తో కలిపి 8 గంటల పనికాలం వుంటుంది. పనికోసం ముఖ్యమంత్రి తొందరపెడుతున్న మాట వాస్తవమే! షిఫ్టుల వారీగా పని చేయవచ్చు కూడా! అందుకు భిన్నంగా కేవలం 10 నిమిషాల భోజన విరామంతో 12 గంటలపాటు కార్మికులతో ఏకధాటిగా పనిచేయిస్తున్నారు. పనిలో ఇనుపదూలం మీదపడి మార్చి 21 న పంజాబ్ కు చెందిన ఒక కార్మికుడు చనిపోయాడు. కాంక్రీట్ మిక్చర్ లో పడి మే 10 న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన దేవేందర్ (22) అనే మరో కార్మికుడు చనిపోయాడు. మొదటి మరణంతో ఆందోళన ఐక్యత పెరిగిన కార్మికులు రెండో మరణంతో తిరగబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా దేవేందర్ మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసినపుడు వాహనాలను తగలబెట్టారు.
విచిత్రంగా పోలీసులు, రెవిన్యూ అధికారులు బాధితుల తరపునగాక కాంట్రాక్టర్ల పక్షాన నిలబడ్డారు. కాంట్రాక్టర్లు కూడా ఇది ముఖ్యమంత్రిగారి స్పెషల్ ఇంట్రెస్టు వున్న పనికాబట్టి ఇలాంటివన్నీ అధికారులే హాండిల్ చేయాలి అన్నట్టు వ్యవహరిస్తున్నరు. కార్మికులకు మద్ధతుగా కృష్టా, గుంటూరు జిల్లాల సిపిఎం నాయకులు రంగంలోకి దిగి, పోలీసు లాఠీ దెబ్బలుతిని, అరెస్టయ్యేసరికి విషయం రోడ్డున పడి దేవేందర్ కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారమివ్వడానికి కాంట్రాక్టర్లు ఒప్పుకున్నారు.
నిపుణులైన స్ధానికులకే పని ఇవవాలన్న షరతు విధించడం ప్రభుత్వానికి కష్టంకావచ్చు. అయితే ఆమేరకు నైతికంగా వొత్తిడి తీసుకురావచ్చు. ఇందుకు భిన్నంగా కాంట్రాక్టరే ఇది సిఎం ప్రయారిటీ అని అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వాతావరణం అక్కడ కనిపిస్తోంది. పన్నెండు గంటల కట్టుబానిసత్వమో వెట్టి చాకిరో బయట పడకుండా కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల కూలీలను నియమించుకున్నారు. సెక్యూరిటీగార్డులు మొదట్లో తెలుగువారే. వారిని తొలగించి వేరే రాష్ట్రాల వారికి నియమించడం వల్ల లోపలి విషయాలు బయటికి తెలిసేవి కాదు. రెండు మరణాల తర్వాతే మూసిపెట్టలేనంత ఉదృతంగా అమరావతిలో కార్మిక దోపిడి బయటపడింది.
అమరావతిలో నిర్మాణరంగపు భద్రతా చర్యలతోపాటు చట్టప్రకారం పనిగంటలు వుండేలా పర్యవేక్షించడానికి ఇప్పటికైనా సంబంధిత శాఖలు నిద్రలేవాలి. ఈ ఏర్పాట్లపై స్వయంగా ముఖ్యమంత్రే ఒకసారి సమీక్షిస్తే కార్మిక హింస, దుర్మరణాలు లేని అమరావతి రూపుదిద్దుకుంటుంది.