మునుగోడులో ఎలాగైనా గెలవాలని తాపత్రయ పడుతున్న టీఆర్ఎస్కు సొంత పార్టీ నేతలు షాకిస్తున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ .. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తనకు టీఆర్ఎస్లో తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన సహచర ఉద్యమకారులు, మిత్రులు కూడా కనీసం ఒక నిముషం కేసీఆర్ను కలవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తుంది అనే పరిస్థితి ఉందని తన రాజీనామా లేఖలో బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహం హైదరాబాద్ లో ప్రభుత్వం తరపున పెట్టలేదన్నారు.
మాజీ ఎంపీని అయిన తనతో మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా ఏ విషయంలోనూ సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగి ఉన్నాను. అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందన్నారు. ప్రముఖ వైద్యుడైన బూర నర్సయ్య గౌడ్.. భువనగిరి నుంచి ఓ సారి టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. ఇటీవన ఆయన టీడీపీ తరపున బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది.
అదే సమయంలో మరో టీఆర్ఎస్ సీనియర్ నేత కర్నె ప్రభాకర్ కూడా టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గానికే చెందిన ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినా ఎప్పుడూ కేసీఆర్ అవకాశాలు కల్పించలేదు. వేచి చూసి చూసి..ఆయన బీజేపీకి వెళ్లాలని అనుకుంటున్నారు. వీరిద్దరూ పార్టీ మారితే.. మునుగోడులో టీఆర్ఎస్కు బీసీ వర్గాలు దూరం అయినట్లేనన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.