వైసీపీ అనుకూల మీడియా ప్లాన్ మార్చింది. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో వ్యూహాత్మకంగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారా..? అనే కథనాలను తెరపైకి తీసుకొచ్చింది. పోలింగ్ ట్రెండ్స్ చూసిన ఎవరికైనా వైసీపీ గెలుపుపై నమ్మకం సన్నగిల్లుతోంది. నీలి మీడియా కూడా అదే అంచనాతో ఉందేమో కానీ, వైసీపీ ఓటమిపై కాకుండా చంద్రబాబు ఓటమి అంటూ కథనాలను ప్రసారం చేస్తోంది.
ఎవరి నోటా విన్నా ఏపీలో కూటమిదే విజయమని మౌత్ టాక్ నడుస్తోంది. విశ్లేషకులు కూడా కూటమి అధికారంలోకి రావడం పక్కా అంటూ ఉదాహరిస్తున్నారు. దీంతో వైసీపీలో ఓ రకమైన ఆలజడి కనిపిస్తోంది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ పరిణామాలు మాత్రం వైసీపీ నేతలకు కనుకు పట్టకుండా చేస్తుండటంతో వారిని స్వయం సంతృప్తి చెందేలా కథనాలు ప్రసారం చేస్తోంది నీలి మీడియా.
టీడీపీ కంచుకోట కుప్పంలో చంద్రబాబు డేంజర్ జోన్ లో ఉన్నారని తరహాలో విశ్లేషణలు చేస్తోంది. వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తారని జగన్ హామీ ఇవ్వడం, కుప్పంకు నీళ్లు ఇవ్వడం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం ప్రదర్శించడంతో కుప్పంలో ఫ్యాన్ గాలి వీయనుందా అని ప్రచారాన్ని మొదలు పెట్టేసింది.
అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు .. అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా భిన్నం. వాటి ఆధారంగా అసెంబ్లీ సీటు టీడీపీ కోల్పోతుందనే విశ్లేషణలు ఏమాత్రం పసలేనివే. పైగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత కనిపించడం, చంద్రబాబు అరెస్ట్ తరువాతి పరిణామాలతో కుప్పంలో టీడీపీ మరింత బలపడింది. అయినప్పటికీ కుప్పంలో చంద్రబాబు ఓటమి అంచులో ఉన్నారన్న కథనాలు వైసీపీ నేతలను సాటిస్ఫై చేసేందుకు తప్ప వాస్తవాలను ముందుంచేందుకు కాదని అభిప్రాయాలు వస్తున్నాయి.