Bluff master trailer
5 కోట్లతో తయారై… 35 కోట్లు సాధించిన తమిళ సినిమా `శతురంగ వెట్టై`. డబ్బు సంపాదించాలన్న కసితో… ఓ అనామకుడు చట్టంలోని లొసుగుల్ని వాడుకుంటూ కోటీశ్వరుడిగా మారినవైనం ఈ కథ. ఈ సినిమాని తెలుగులో `బ్లఫ్ మాస్టర్` పేరుతో రీమేక్ చేస్తున్నారు. సత్యదేవ్ కథానాయకుడు. నందితా శ్వేత కథానాయిక. గోపీగణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 28న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. కథలోని కాన్సెప్ట్, కథానాయకుడి పాత్ర చిత్రణ.. ఇవి రెండూ ట్రైలర్లోనే చెప్పేశారు. ట్రైలర్ అంతా డబ్బు చుట్టే తిరిగింది. డబ్బుకు లోకం ఎలా దాసోహం అంటుందో, పంచభూతాల్ని తన గుప్పిట్టో పెట్టుకున్న ఆరో భూతంగా ఎలా మారుతుందో… డైలాగుల రూపంలో చెప్పేశారు. సత్య ఇంటెన్సీవ్ ఉన్న నటుడు. తనకు ఈ సినిమాతో బ్రేక్ దొరికేలానే కనిపిస్తోంది. ఇదో థ్రిల్లర్. ఉత్కంఠత గొలిపే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. వాటిని దర్శకుడు కూడా పక్కాగా తెరపైకి తీసుకొచ్చాడనే అనిపిస్తోంది. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్, డైలాగులు.. అన్నీ బాగానే ఉన్నాయి. బాక్సాఫీసు దగ్గర నిలబడగలిగితే… సత్యదేవ్‌కి హీరోగా ఇంకొన్ని అవకాశాలు రావడం ఖాయం.