రవీంద్రనాథ్ ఉరఫ్ బాబీ – పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్, ‘జై లవకుశ దర్శకుడు. జై లవకుశ తో హిట్టు కొట్టిన బాబీ ఒక దినపత్రిక లో ఆ సినిమా విశేషాలతో పాటు కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ‘జై లవకుశ’ పాత్రల్లో ఎన్టీఆర్‌ని తప్ప మరెవ్వరినీ వూహించలేను. మరీ ముఖ్యంగా ‘జై’గా చెలరేగిపోయారు. ‘మా ఎన్టీఆర్‌ని చాలా కొత్తగా చూపించారు’ అని ఆయన అభిమానులంతా అంటుంటే నా ఆనందానికి అవధుల్లేవు’’. ఇక ‘జై లవ కుశ’ విడుదల రోజు చిరంజీవి మా ఇంటికొచ్చారు అని చెబుతూ ఆ విషయాలు ఇలా పంచుకున్నారు-
నేను చిరు ఫ్యాన్ అని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మా నాన్న నాకంటే పెద్ద అభిమాని. చిరంజీవి సినిమా విడుదలైతే అందరికంటే ముందు నాన్న తయారైపోయేవారు. ఆమధ్య నాన్నగారి ఆరోగ్యం పాడైంది. ‘ఏరా.. చిన్నప్పుడు నీకన్ని చిరంజీవి సినిమాలు చూపించా. నాకు ఆయన్ని చూపించవా’ అని అడిగారు. అలా అనేసరికి నాకు చాలా బాధేసింది. వినాయక్‌గారికి విషయం చెప్పా. సరిగ్గా అరగంటలో ఆయన్నుంచి ఫోన్… ‘చిరంజీవి గారే మీ ఇంటికి వస్తానన్నారు’ అని. ‘వద్దుసార్.. మేమే వస్తాం’ అని వినయ్ గారికి చెప్పా. కానీ ఆయన వినలేదు. ‘జై లవ కుశ’ విడుదల రోజున చిరంజీవిగారు మా ఇంటికి వచ్చి మాతో రెండుగంటల పాటు గడిపారు. నాన్నకి నేనిచ్చిన అత్యంత విలువైన గిఫ్ట్ అదే!!!