పాన్ ఇండియా మహత్మ్యం… కాస్త స్టార్డమ్ ఉన్న నటీనటులకు కూడా చేతినిండా పని దొరుకుతోంది. సొంత భాషలో సినిమాల్లేక ఖాళీగా ఉన్నవాళ్లు, మరో భాషలో బిజీ అయిపోతున్నారు. బాబీ డియోల్ విషయంలో ఇదే జరుగుతోంది. బాలీవుడ్ లో బాబీ డియోల్లో అందరూ పక్కన పెట్టేశారు. ఈ దశలో చిత్రంగా సౌత్ సినిమాలతో బిజీ అయిపోయాడు బాబీ. ‘యానిమల్’ తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాతో తనకు పూర్వ వైభవం దక్కింది. ఇప్పుడు సౌత్ సినిమాల్లో తనో హాట్ కేక్.
‘హరి హర వీరమల్లు’ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘కంగువా’లో కూడా తనే విలన్. బాలకృష్ణ – బాబీ సినిమాలో తను ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాబీని సంప్రదించారు. ఇప్పుడు ఎన్టీఆర్ `దేవర`లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ‘దేవర’లో ఆల్రెడీ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే దేవర రెండు భాగాలుగా రాబోతోంది. రెండో భాగంలో బాబీ డియోల్ కనిపించే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాల కోసం బాబీని సంప్రదిస్తే డేట్లు ఖాళీగా లేవని పక్కన పెట్టాడు. అంత బిజీ అయిపోయాడు బాబీ. బాలీవుడ్ లో అవకాశాల్లేక.. దుకాణం బంద్ చేసిన ఓ నటుడు పాన్ ఇండియా సినిమాల పుణ్యాన మళ్లీ రేసులోకి రావడం, సౌత్ సినిమాలతో బిజీ అయిపోయి, కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితికి రావడం మామూలు విషయం కాదు. ఒకొక్క సినిమాకూ బాబీ డియోల్ రూ.4 నుంచి రూ.5 కోట్ల పారితోషికం తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇది చాలా పెద్ద మొత్తమే. బాలీవుడ్ లో బాబీ హీరోగా చేసినా ఈ స్థాయిలో పారితోషికం అందుకోడేమో..?