హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారం విజయవాడలో సంచలనం సృష్టిస్తోంది. అత్యధిక వడ్డీలకు అప్పులిచ్చి, తీసుకున్నవారిని మానసికంగా, శారీరకంగా వేధిస్తోన్న వ్యాపారుల ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. వీరిలో కొందరు, అప్పులు తీసుకున్న మహిళలను వ్యభిచార వృత్తిలోకి దించారని, నగ్నంగా వీడియోలు తీసి బెదిరించారని, రాత్రుళ్ళు బౌన్సర్లను తీసుకెళ్ళి బెదిరించారని తెలుస్తోంది. కాల్ మనీ నిర్వాహకులు పరారీ అవగా, ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పులు తీసుకున్నవారినుంచి తీసుకున్న ఇళ్ళు, ఇతర ఆస్తుల డాక్యుమెంట్లను నిర్వాహకులు ఒక రహస్య ప్రదేశంలో దాచినట్లు తెలిసింది. ఆ రహస్యప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేయగా మూడు బస్తాల డాక్యుమెంట్లు దొరికినట్లు సమాచారం. అప్పులు తీసుకుని చెల్లించనివారిని ఒక ఇంట్లోపెట్టి బౌన్సర్లతో కొట్టించినట్లు బయటపడింది. ఒక ప్రభుత్వోద్యోగి – ట్రాన్స్‌కో ఉన్నతాధికారి సత్యానందంకు కూడా కీలకపాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అతను పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ కేసులో తెలుగుదేశం ప్రజాప్రతినిధుల హస్తం ఉందని బయటపడటం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ-విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బుద్దా వెంకన్నలకు ప్రమేయం ఉందని బయటపడింది. కాల్ మనీ వ్యాపారి వెనిగళ్ళ శ్రీకాంత్‌తో సంబంధాలపై ఎమ్మెల్యే ప్రసాద్ స్పందిస్తూ, అతను తనకు స్నేహితుడు మాత్రమేనని, అతనితో ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. ప్రసాద్ ఇప్పుడు కాల్ మనీ నిందితుడు శ్రీకాంత్ తదితరులతో కలిసి బ్యాంకాక్ వెళ్ళినట్లు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు వంగవీటి రాధా మేనమామ చెన్నుపాటి శ్రీనివాస్‌కు కూడా ఈ కాల్ మనీ వ్యాపారమున్నట్లు బయటపడింది. అతనుకూడా పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే కాల్ మనీ వ్యాపారులకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ ప్రకటించారు. అప్పులు తీసుకున్నవారు కట్టొద్దని పిలుపునిచ్చారు. మంత్రి దేవినేని ఉమా, విజయవాడ ఎంపీ కేశినేని నాని నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక టీడీపీ నేతల ప్రమేయం బయటపడటంతో కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. దేవినేని నెహ్రూ దీనిపై ఇవాళ మీడియాతో మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్ మనీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినీ ఉపేక్షించరాదని అధికారులను ఆదేశించారు.