ఒక్క చిన్న హీరోయిన్‌పై మూడు కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. సుషాంత్ ఆత్మహత్య చేసుకునే వరకు .. రియా చక్రవర్తి స్టార్ హీరోయిన్ కూడా కాదు. సెకండ్ హీరోయిన్ పాత్రలొస్తే చాలనుకునే సెలబ్రిటీ. ఇప్పుడు ఆమె.. అందరికీ పరిచయమయ్యారు. మొదట నెపోటిజం అన్నారు.. తర్వాత సుశాంత్ ఆత్మహత్య కేసులో నిందితురాలు అన్నారు. తర్వాత ఆయన డబ్బులు నొక్కేసిన కేసులో నిందితురాలన్నారు. ఇప్పుడు డ్రగ్స్ సరఫరా చేసిందని అంటున్నారు. ఆరోపణలు మారుతున్నా.. కేసు మాత్రం రియా వద్దకే వెళ్తోంది. చివరికి అరెస్ట్ చేశారు కూడా. ఆమెపై ఇప్పుడు బాలీవుడ్లో సానుభూతి కనిపిస్తోంది.
డ్రగ్స్ కేసులో రియాను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు మద్దతుగా పలువురు నటులు సోషల్ మీడియాలోకి వస్తున్నారు. జస్టిస్ ఫర్ రియా అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమెను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రియా అరెస్ట్‌కు నిరసనగా కొంత మంది తారలు బ్లాక్ స్క్రీన్‌ను పోస్ట్ చేశారు. సోనమ్ కపూర్, విద్యా బాలన్, పుల్కిత్ సామ్రాట్, హుమాఖురేషీ, దియా మీర్జా, అనురాగ్ కశ్యప్, తాప్సీ సహా పలువురు భయప పలువురు పోస్టులు పెడుతున్నారు.
తాప్సీ లీగల్‌గా కొన్ని పాయింట్లను కోట్ చేసి మరీ రియా తప్పేం చేసిందని అడుగుతున్నారు. రియా డ్రగ్స్ ను కొనుగోలు చేసి సుశాంత్‌కు అందించారని ఎన్సీబీ రిపోర్ట్‌లో ఉందని.. సుశాంత్ బతికి ఉండి ఉంటే తాను కూడా జైలుకు వెళ్లి ఉండేవాడు కాదా… అని ప్రశ్నించింది. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ కూడా…రియాకు మద్దతుగా ఆమె టీషర్టుపై ఉన్న స్లోగన్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. మొత్తానికి ఒక్క ఒంటరి అమ్మాయిని .. అత్యంత దారుణంగా వేటాడుతున్నారన్న అభిప్రాయం మాత్రం సాధారణ నెటిజన్లలో కూడా ఏర్పడుతోంది.