ఓ సినీ నటుడు ఆత్మహత్య చేసుకుంటే… ఆ చుట్టూ మూగే వివాదాలు.. ఊహాలు.. ఆరోపణలు లెక్క లేనన్ని ఉంటాయి. వారి పర్సనల్ లైఫ్‌లో గాసిప్స్‌ని ఎలా ఆసక్తిగా మీడియా సంస్థలు మార్కెటింగ్ చేసుకుంటాయో.. వారు చనిపోయిన తర్వాత కూడా… అనుమానాలుంటే.. అంత కంటే ఎక్కువగా మార్కెట్ చేసుకుంటాయి. ప్రస్తుతం సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక ఇలాంటిదే జరుగుతోంది. మొదటగా.. సుషాంత్ది హత్య అనే అర్థంలో ప్రచారం చేశారు. పోస్ట్‌మార్టం తర్వాత ఆయనకు సినీ పరిశ్రమలో వేధింపులు ఎదురయ్యాయని.. దూరం పెట్టారని అందుకే మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం ప్రారంభించారు.
మొదట హీరోయిన్ కంగనా రనౌత్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. బాలీవుడ్ పెద్దలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. సహజంగానే…ఆమె రెబల్ క్యాండిడేట్. సుషాంత్ విషయంలో చాలా మంది తప్పుగా వ్యవహరించారని.. చాన్సుల్లేకుండా చేశారని ఆరోపించారు. ఆ తర్వాత.. రామ్‌గోపాల్ వర్మ ఫ్రెండ్.. ఆయనకు మించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. కమల్ ఆర్ ఖాన్.. అనే బీ గ్రేడ్ సినిమాల నిర్మాత… దర్శకుడు.. నటుడు… కొన్ని నిర్మాణ సంస్థల పేర్లు పెట్టి.. వారందరూ.. సుషాంత్ను బ్యాన్ చేశారని.. అందుకే ఆయనకు చాన్సులు లేవని చెప్పుకొచ్చారు. ఈ లోపు దిగ్గజ దర్శకుడు శేఖర్ కపూర్ కూడా.. ఓ ట్వీట్ చేశారు. సుషాంత్.. దారుణమైన మానసిక క్షోభ అనుభవించారని.. తన భుజాలపై పడి ఏడ్చారని.. చెప్పుకున్నారు. పానీ అనే సినిమాలో సుషాంత్ను పెట్టుకున్నారు శేఖర్ కపూర్. కానీ ఆ సినిమా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది.
సుషాంత్ ఇటీవల వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. దానికి కారణంగా ఆయనకు హీరోగా చాన్సులు లేకపోవడమేనని కొంత మంది చెబుతున్నారు. అయితే.. ఆయనకు చాలా చాన్సులు ఉన్నాయని… అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలేవీ.. సుషాంత్‌తో పని చేయకపోవడానికి ఇష్టపడటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బహుశా.. బాలీవుడ్ అంతర్గత రాజకీయం కూడా.. సుషాంత్ ఆత్మహత్యకు కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సుషాంత్ విషయంలో ఏం జరిగిందో కానీ.. కొద్ది రోజుల పాటు కథనాలకు మాత్రం కొదువ ఉండదు.