మనదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కూడా ఒకటి. ముంబాయిలో జరిగిన ఈ భారీ కుంభకోణం దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనమే. ఈ కుంభకోణంకు సంబంధించిన కేసును సుదీర్ఘకాలంగా విచారిస్తున్న ముంబాయి హైకోర్టు శుక్రవారం నాడు అంతకంటె సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. 31 అంతస్తుల ఆదర్శ్ బిల్డింగ్ సొసైటీని కూల్చేయాలని తీర్పు చెప్పింది. కేంద్ర పర్యావరణ శాఖను ఈ మేరకు ఆదేశించింది. ఈ స్కాంతో సంబంధం ఉన్న అధికారులు, మొదట్లోనే స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ ప్రారంభించాలని కూడా ఆదేశించింది.
ఆదర్శ్ సొసైటీ అంటే కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలు, ఇతర సైనికుల కోసం ఏర్పడిన సొసైటీ. ఈ సొసైటీ పేరుతో తొలుత ఆరు అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. తర్వాత సొసైటీ 31 అంతస్తుల భవనాలు నిర్మించారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారంతా అడ్డగోలుగా తమకు కావాల్సిన వారందరికీ ఎడాపెడా ప్లాట్లు కేటాయించేసుకున్నారు. అక్కడినుంచి వివాదం మొదలై ఇప్పుడు మొత్తం భవనాలను కూల్చివేయాలనేంత వరకు కోర్టు తీర్పు వెలువడే వరకు వచ్చింది.
అయితే మొత్తం సొసైటీలోని వందల కోట్ల రూపాయల విలువైన 31 అంతస్తుల భవనాలు అన్నింటినీ కూల్చివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక చర్చోపచర్చలకు దారి తీస్తున్నది. కుంభకోణం జరిగిన మాట వాస్తవం. అందుకు కారకులైన వారిని, బాధ్యులైన వారిని శిక్షించడం కూడా అంతే అవసరం. అయితే అందుకు భవనాలను కూల్చేయడం ఎందుకు? అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది. అక్రమంగా ఇక్కడ ఫ్లాట్లు తీసుకున్న వారందరివీ రద్దు చేసేసి.. అవి అచ్చంగా.. సైనికుల సొసైటీకి లేదా, సైనికులకు చెందేలా.. నిర్మాణాలు వృథా కాకుండా ఉండేలా తీర్పు చెప్పి ఉంటే బాగుండేదని పలువురు న్యాయనిపుణులు భావిస్తున్నారు. అనుమతుల సమయంలో నిర్లక్ష్యం వహించిన వారిని శిక్షించడం సబబే కానీ, పూర్తయిన నిర్మాణాలు జాతీయ సంపద అని, ఇప్పుడు వాటిని సాంతం కూల్చేయాలనడం భావ్యం కాదేమోనని పలువురు భావిస్తున్నారు. అక్రమాలకు సంబంధించినంత మేరకు, వందల వేల కోట్ల రూపాయల సొమ్ములు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేలా మధ్యేమార్గంగా ఒక తీర్పు ఉంటే.. భవిష్యత్తులోనూ ఇలాంటి అక్రమాలు చేసేవారికి గుణపాఠంగా ఉండేదని పలువురు అంటున్నారు.