వేర్ ద లాజిక్ స్టార్స్ట్… డ్రామా ఎండ్, వేర్ ద డ్రామా స్టార్ట్స్ .. లాజిక్ ఎండ్
– అని హిచ్ కాక్ అనే ఓ పెద్దాయన చెప్పాడు. లాజిక్‌వేసుకుంటూ వెళ్లిన చోట డ్రామా కనిపించదు, డ్రామా మొదలైన చోట.. అక్కడ లాజిక్ తో పనిలేదు. `బొంభాట్`.. సినిమా కూడా ఇదే వాక్యంతో మొదలవుతుంది. ఈ లైన్ చూడగానే.. ఈ సినిమాలో కావల్సినంత లాజిక్కు, బోలెడంత డ్రామా ఉంటుందనుకుంటారు. తీరా చూస్తే.. అవి రెండూ ఈ సినిమాలో మచ్చుకైనా కనిపించవు. మరి ఏమున్నాయంటే..
విక్కీ (సాయి సుహాంత్ రెడ్డి) ఓ అన్ లక్కీ ఫెల్. తాను పుట్టినప్పటి నుంచీ ఇంట్లో వాళ్లకు కష్టాలే. అడుగుపెట్టిన చోట.. మసి. దురదృష్ట జాతకుడుగా జ్యోతిష్యులు సైతం తేల్చేస్తారు. గ్రహాలు మారకపోతాయా? ఎప్పటికైనా మంచి జరక్కపోతుందా అనే నమ్మకంతో బతికేస్తుంటాడు. అలాంటి విక్కీ.. చిన్నప్పుడే ఆచార్య అనే ఓ ప్రొఫెసర్‌తో స్నేహం చేస్తాడు. పెరిగి పెద్దయ్యాక.. చైత్ర (చాందినీ చౌదరి)ని ఇష్టపడతాడు. తన దురదృష్టం కొద్దీ… చైత్ర కూడా హ్యాండ్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. ఇలాంటి తరుణంలో మాయ (సిమ్రాన్ చౌదరి) పరిచయం అవుతుంది. ప్రొఫెసర్ ఆచార్య కూతురే మాయ. ఆచార్య దగ్గర ఉన్న ఓ హార్డ్ డిస్క్ దక్కించుకోడం కోసం.. ఓ పిచ్చి సైంటిస్ట్ ప్రయత్నిస్తుంటాడు. చివరికి ఆచార్య ప్రాణాలు కోల్పోవాల్సివస్తుంది. పోతూ పోతూ.. మాయ బాధ్యత విక్కీకి అప్పగిస్తాడు. మాయ… మాయ కాదు. మాయలో ఓ మాయ ఉందని గ్రహిస్తాడు విక్కీ. ఇంతకీ మాయలో ఏముంది? మాయ చేసే విన్యాసాలేంటి? అన్నదే `బొంభాట్` కథ.
శంకర్ తీసిన `రోబో` గుర్తుంది కదా? మనిషిని పోలిన రోబో కథ. దానికీ మనసుంటే, తాను కూడా ఓ మనిషిని ఇష్టపడితే ఏమవుతుంది? తనని శత్రు వినాశనానికి వాడితే ఏం జరుగుతుంది? అన్నదే పాయింట్. దాన్నే అటూ ఇటూ మార్చి `బొంభాట్`గా తీశారేమో అనిపిస్తుంది. రోబోని చాలా లావిష్ బడ్జెట్ తో తీశారు. రోబోతో శంకర్ చేసిన విన్యాసాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ బడ్జెట్ లేదు కదా. అందుకే అన్ని ఆశ్చర్యాలూ ఉండవు. కనీసం కొత్త ఐడియాలజీ అయినా ఉండాలి కదా. దురదృష్టం కొద్దీ అదీ కరువైంది. అసలు పాయింట్ లోకి వెళ్లడానికే దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇంట్రవెల్ నాటికి… మాయ ఎవరో తెలుస్తుంది. ఆ తరవాతైనా కథ ముందుకు సాగదు. దానికి తోడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ టచ్ ఇచ్చి… రోబో సినిమాని మరోసారి గుర్తు చేశారు. సన్నివేశాల సాగదీత.. నస పెంచుతుంది.
అసలు మాయని ఎందుకు ఎవరు తయారు చేశారు? మాయకు వచ్చిన ముప్పేంటి అనేది క్లైమాక్స్ వరకూ తెలీదు. అది తెలిసిన పది నిమిషాలకే కథ ముగుస్తుంది. సైన్స్ ఫిక్షన్ చేసేటప్పుడు.. ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లాలి. అంతకు ముందు చూడని విజువల్స్నిచూపించాలి. అవేం బొంభాట్ లో కనిపించవు, దానికి తోడు సిల్లీ సీన్స్ పేర్చుకుంటూ వెళ్లారు. కథకు అవసరం లేని విషయాలెన్నో జరుగుతుంటాయి. ఓ దాదా.. మాయని ఇష్టపడడం, పెళ్లి చేసుకుంటా అని వెంటపడడం.. మరింత బోరింగ్ వ్యవహారం. ఓ దురదృష్టవంతుడి కథ ఇది. మాయ పరిచయం అయిన తరవాతైనా.. తన జాతకంలో మార్పు వచ్చినట్టు చూపిస్తే బాగుండేది. అదీ లేదు. అసలు లన్ లక్కీ ఫెలోకీ, ఈ కథకీ సంబంధం ఏమిటో అర్థం కాదు. కథని ఎక్కడో మొదలెట్టి, ఇంకెక్కడికో తీసుకెళ్లి ముగించినట్టు అనిపిస్తుంది.
సాయి సుహాంత్ నటనే అంతో, కావాలని ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో అర్థం కాదు. హీరోగా నిలదొక్కుకోవాలంటే ఇంకా ఎదగాలి. ఇంకా నేర్చుకోవాలి. చైత్రగా చాందినీ అందంగా కనిపించింది. మాయగా సిమ్రాన్‌లో ఎక్స్ప్రెషన్స్ లేవు. కానీ… రోబో పాత్రకి ఎక్స్ప్రెషన్స్ లేకపోవడమే ప్లస్. అందుకే తనని తీసుకున్నారు. సైంటిస్టులిద్దరికీ… శుభలేఖ సుధాకర్‌నే గొంతు ఇచ్చినట్టుంది. ఇద్దరి వాయిస్ లో తేడా లేదు. పైగా.. ఆ డబ్బింగ్ పాత్రల నటనని డామినేట్ చేసింది. ప్రియదర్శిని లాంటి కమిడియన్ ని పెట్టుకున్నా… నవ్వించలేకపోయారు.
స్క్రిప్టుపై దర్శకుడు అంతగా దృష్టి పెట్టలేదు. కేవలం అన్ లెక్కీ ఫెల్ గాడి కథ అంటూ మొదలెట్టి, దాని చుట్టూ కథని నడిపినా బాగుండేది. అదో ఎంటర్టైన్మెంట్ సినిమాగా మిగిలిపోయేది. అనవసరంగా.. సైన్స్ ఫిక్షన్ ని కూడా కలిపేశారు. పాటలు ఓకే అనిపిస్తాయి. నంగనాచి పాట ట్యూన్ బాగుంది. పిక్చరైజేషన్ కూడా నచ్చుతుంది. అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.