హైదరాబాద్: ఆరెంజ్, ఒంగోలు గిత్త వంటి అపజయాలతో తెలుగులో కనుమరుగైపోయిన బొమ్మరిల్లు భాస్కర్ మొత్తానికి ఒక మంచి హిట్ కొట్టారు. అయితే ఈసారి తెలుగులో కాకుండా తన మాతృభాష తమిళంలో విజయం సాధించారు. మళయాళంలో ఒక అద్భుతమైన విజయం సాధించిన ‘బెంగళూర్ డేస్’ చిత్రాన్ని తెలుగు నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పీవీపీ పతాకంపై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తమిళంలో రీమేక్ చేశారు. ‘బెంగళూరు నాట్గల్’ పేరుతో ఈ చిత్రం మొన్న 5వ తేదీన రిలీజ్ అయింది. ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహా ముఖ్యపాత్రలను, తెలుగు నటుడు రానా కీలక పాత్రను, లక్ష్మీ రాయ్, సమంత, ప్రకాష్ రాజ్ అతిథి పాత్రలను పోషించారు. చిత్రానికి మంచి రివ్యూలతో పాటు టాక్ కూడా బాగా వచ్చింది. చాలావరకు కట్ అండ్ పేస్ట్ గానే సాగినప్పటికీ, మూలంలోని కంటెంట్ దెబ్బతినకుండా తీశారని విమర్శకులు మెచ్చుకున్నారు. ఆర్య, బాబీ సింహ బాగా చేశారని ప్రశంశలు లభించాయి. ముఖ్యంగా కేవీ గుహన్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉందంటున్నారు.
బొమ్మరిల్లు, పరుగు వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన భాస్కర్‌కు ఎట్టకేలకు ఈ చిత్రంతో మళ్ళీ హిట్ దొరికిందన్నమాట. ఇక తెలుగులో, తమిళంలో ఎడా పెడా సినిమాలు నిర్మిస్తున్న పీవీపీ బ్యానర్‌కు మరో విజయం లభించింది. ఆ బ్యానర్లో ప్రస్తుతం నాగార్జున, కార్తి హీరోలుగా ఊపిరి అనే చిత్రం, రానా, తాప్సిలతో ఘాజీ అనే చిత్రం, మహేష్‌తో బ్రహ్మోత్సవం, గ్రహణం అనే తమిళ చిత్రం, క్షణం అనే తెలుగు చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. సునీల్ ‘మర్యాదరామన్న’ చిత్రాన్ని తమిళ కమెడియన్ సంతానంతో రీమేక్ చేసి పీవీపీ ప్రసాద్ గతంలో కూడా తమిళ ఒక హిట్ కొట్టారు.