వెంకటగిరి నియోజకకవర్గంలో ఆనం రూ. 50 కోట్లు ఖర్చు పెడతారు..! నువ్ ఆ మాత్రం ఖర్చు పెట్టగలవా..? . నాలుగున్నరేళ్ల పాటు వెంకటగిరి నియోజకవర్గానికి సమాన్వయకర్తగా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్న ఇది. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా.. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి.. వైసీపీకి రాజీనామా చేశారు. జగన్ నాయకత్వంలో పని చేయడం కంటే ఇంట్లో ఉండటం మేలని తీర్మానించుకున్నారు. ఆత్మాభిమానం చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదంటున్నారు. నిన్నామొన్నిటి వరకు.. నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. టిక్కెట్ ఆయనకే వస్తుందనుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని.. వైసీపీ సమన్వయకర్తగా నియమించారు జగన్.
తనను తీసేసి.. ఆనంను సమన్వయకర్తగా పెడుతున్న విషయం.. బొమ్మిరెడ్డికి వైసీపీ హైకమాండ్ మాట మాత్రంగా కూడా చెప్పలేదు. విశాఖలో జరిగిన సమన్వయకర్తల సమావేశానికి పిలవకపోగా.. పిలకవకపోయినా వస్తారేమోనన్న అనుమానంతో ఫోన్ చేసి రావాల్సిన అవసరం లేదని మొహం మీదే చెప్పారయ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనుభవం కంటే డబ్బున్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని బొమ్మిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం వెంకటగిరి. వైసీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో.నాలుగున్నరేళ్లుగా బొమ్మిరెడ్డినే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మేకపాటి వర్గంగా ఆయన గుర్తింపు పొందారు.
వెంకటగిరి నియోజకవర్గంలో జగన్ చేస్తున్నరాజకీయం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డిని చేర్చుకుని బొమ్మిరెడ్డిని పక్కన పెట్టేశారు. ఆనంను సమన్వయకర్త పదవి ఇచ్చారు.అయితే.. వెంటనే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు.. రాంకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు కూడా వెంకటగిరి టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. మరి ఆనంకు కూడా గ్యారంటీ ఉందా లేదా అన్న విషయం వైసీపీ నేతలకే అర్థం కావడం లేదు. జగన్ చేస్తున్న డబ్బు రాజకీయంతో..నెల్లూరు జిల్లా వైసీపీలో చిచ్చు ప్రారంభమైంది. దీనిపై మేకపాటి వర్గం ఎలా స్పందిస్తుందో అన్నదానిపైనే.. నెల్లూరు వైసీపీలో తదుపతి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.