టిడిపి నేత బోండా ఉమా ప్రెస్ మీట్ లో పలు సంచలన విషయాలను బయట పెట్టాడు. ఇటీవల జగన్ చేస్తున్న ఢిల్లీ పర్యటన వెనుక గుట్టు ఇదేనంటూ ఆయన చేసిన పలు ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే..
అసలు గుట్టు ఇది:
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ కేసులో నిందితులు గా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనను అరెస్టు చేసి అక్కడే జైల్లో ఉంచారు. ఆ తర్వాత ఆయన కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చి నప్పటి కీ భారతదేశానికి రాలేకపోయారు. బొండా ఉమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ని సెర్బియా దేశానికి ఫారిన్ ట్రిప్ వెళ్ళి నప్పుడు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని, వాన్ పిక్ కేసులో నిజా నిజాలు ప్రజలకు తెలియ చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారని గుర్తు చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్, జగన్ తో పాటు ఏ1 నుంచి ఏ14 వరకు మొత్తం 14 మంది మీద రస్ అల్ ఖైమా ఇంటర్పోల్ ని ఆశ్రయించింది అని, ఈ విషయమై ఇంటర్ పోల్ భారత ప్రభుత్వానికి లేఖ రాయడం వల్లే జగన్ పరిగెత్తుకుంటూ ఢిల్లీ వెళ్లారని బోండా ఉమ వ్యాఖ్యానించారు.
ప్రజలను డైవర్ట్ చేయడానికి రాజధాని మార్పు, కేంద్ర మంత్రి వర్గం లో చేరిక రూమర్లు:
అయితే తన పర్యటన వెనుక అసలు గుట్టు బయట పడకుండా ఉండటం కోసం, అమరావతి రాజధానిని విశాఖపట్నం మార్చడం, కేంద్ర మంత్రి వర్గం లో వైసీపీ చేరడం వంటి అంశాలమీద కేంద్ర ప్రభుత్వం తో చర్చించడానికి ఢిల్లీ పర్యటనలు అంటూ ప్రజలను డైవర్ట్ చేశారని బోండా ఉమ అన్నారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే గనక ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి పి కానీ కేంద్ర మంత్రులను కానీ కలిస్తే, వారి భేటీ తర్వాత అక్కడే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తాము ఏమి చర్చించామో, తమ ప్రతిపాదన కు కేంద్రం ఎలా స్పందించిందో వివరిస్తారని, కానీ జగన్ మాత్రం ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, కేంద్ర పెద్దలను కలిసిన తర్వాత ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకుండా, వెనక్కి వచ్చేస్తారని బోండా ఉమా గుర్తు చేశారు. దీన్ని బట్టే జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తన సొంత అవసరాల కోసం కేంద్ర పెద్దలను కలుస్తున్నట్లు అర్థమవుతోందని బోండా ఉమా చెప్పుకొచ్చారు.
ఏ1 నుంచి ఏ14 వరకు ఎవరికైనా ఆ విదేశాలకు వెళ్లే దమ్ముందా?
రస్ అల్ ఖైమా తో పాటు మధ్య ఆసియా లేదా ఐరోపా దేశాలకు ఏ1 నుంచి ఏ14 వరకు ఎవరు విదేశాలకు వెళ్లినా, వారి మీద ఇప్పటికీ నిఘా ఉంచిన ఇంటర్పోల్ వారిని అదుపులోకి తీసుకుంటుంది అని, అందుకే జగన్ మోహన్ రెడ్డి తో సహా ఈ 14 మంది లో ఎవరు ఆ విదేశాలకు వెళ్ళే సాహసం చేయలేరు అని వ్యాఖ్యానించారు. గత ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించారని, అయితే ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ కానీ ఆయనతో పాటు నిందితులుగా ఉన్న ఆయన అనుయాయులు కానీ దావోస్ వెళ్తే ఎయిర్పోర్టులో దిగగానే ఆయా ప్రభుత్వాలు కానీ ఇంటర్పోల్ కానీ వారిని అరెస్టు చేస్తుందనే భయంతో పెట్టుబడుల కోసం కూడా దావోస్ లాంటి ప్రాంతాలకు వెళ్లడం లేదని, దీని వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని బోండా ఉమా వ్యాఖ్యానించారు.
మొత్తం మీద:
మొత్తం మీద, బొండా ఉమా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రస్ అల్ ఖైమా వేట నుండి తప్పించుకోవడానికి జగన్ ఢిల్లీ బాట పట్టారు అనే వార్తలు రాజకీయ వర్గాలనే కాకుండా సామాన్యుల లో కూడా చర్చనీయాంశంగా మారాయి.