తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా జనసేన పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టివి ఛానల్ ముఖాముఖిలో బోండా ఉమా చేసిన ఈ వ్యాఖ్యలు వీక్షకులకి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
మా నేతలు కాదు కదా, వారి కారు డ్రైవర్లు కూడా జనసేన లో చేరరు: బోండా ఉమా
ఇటీవల టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కాపు నేతలు ఒక ప్రత్యేక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. వారు పార్టీ మారడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్న రూమర్లు వచ్చాయి. బీజేపీ లోకి వెళదాం అని కొందరు , కాదు వైఎస్ఆర్ సీపీ లోకి వెళదాం అని మరికొందరు ప్రతిపాదించినట్లు గా కూడా రూమర్లు వచ్చాయి. అయితే జ్యోతుల నెహ్రూ వంటి లీడర్లు ఆ సమావేశం గురించి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మారె విషయం గురించి చర్చించుకోవడానికి తాము సమావేశం కాలేదని, కేవలం తమ సామాజిక వర్గం ఓట్లు కూడా వైఎస్ఆర్ సీపీ నేతలకు పడటం గురించి, తిరిగి ఏ విధంగా తమ ఓట్లు తాము తెచ్చుకోవాలి అన్న విషయాలు చర్చించడం గురించి తాము సమావేశం అయ్యాం అని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇవాల్టి టీవీ ఛానల్ కార్యక్రమంలో బోండా ఉమా మాట్లాడుతూ , ఆ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న కాపు నేతలు, మాజీ ఎమ్మెల్యేల లో ఎవరైనా జనసేన లో చేరే ప్రతిపాదన చేశారా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ” ఆ నేతలు కాదు కదా, వాళ్ళ కారు డ్రైవర్లు కూడా జనసేన లో చేరరు” అంటూ కాస్త పరుషంగా సమాధానమిచ్చారు. బోండా ఉమా చేసిన ఈ వ్యాఖ్యలు షాకింగ్ గా ఉండడమే కాకుండా, ఆయన అహంకార ధోరణి వ్యక్తం చేస్తున్నాయని జనసేన అభిమానులతో పాటు చూసిన కొందరు ఇతర ప్రేక్షకులు కూడా అంటున్నారు.
2014 నుండి 2018 వరకు పవన్ పేరు ఉపయోగించుకున్న బోండా ఉమా
2014లో తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ఇచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు బోండా ఉమాకు సీటు వచ్చే అవకాశం లేదని వార్తలు వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసే వాడని , ఆయన తో చంద్రబాబుకు ఒక మాట చెప్పించడానికి విపరీతంగా ప్రయత్నించాడని, మొత్తానికి పవన్ కళ్యాణ్ మద్దతు తో సీటు తెచ్చుకున్నాడని, గెలిచిన తర్వాత కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాం అని చెప్పుకున్నాడు అని జనసేన అభిమానులు గుర్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే జనసేనకు వెళతా అన్నట్లుగా రూమర్లు సృష్టించే వాడని, తద్వారా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించే వారని కూడా వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి బోండా ఉమ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇంత అహంకారంగా మాట్లాడటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జనసేనలో చేరతారా అన్న ప్రశ్నకు – అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని కానీ, తాను చేరడం లేదు అని కానీ చెప్పి ఉంటే సరిపోయేది అని, కాపు నేతలు కాదు కదా, వారి కారు డ్రైవర్లు కూడా జనసేన లోకి చేరరు అని చెప్పి తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించుకున్నాడని వారంటున్నారు. అంతే కాకుండా తాను కేవలం 12 ఓట్లతో ఓడిపోయాను అనే అహంకారం బోండా ఉమా కి వచ్చిందని అంటున్నారు.
గత ఐదేళ్లలో బోండా ఉమ మీద విపరీతమైన ఆరోపణలు :
గత ఐదేళ్లలో బోండా ఉమా మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. భూ కబ్జా ఆరోపణలు తీవ్రమైన స్థాయిలో వచ్చాయి. తనకు ఓట్లు వేసిన వారి భూములు, తన సొంత సామాజిక వర్గం వారి భూములు కూడా కబ్జా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఐఏఎస్ స్థాయి అధికారి అయిన బాలసుబ్రమణ్యం మీద బోండా ఉమా దౌర్జన్యంగా ప్రవర్తించడం, తర్వాత ముఖ్యమంత్రితో చీవాట్లు తినడం, మళ్లీ మీడియా ముఖంగా ఆ సంఘటన మీద పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కూడా తెలిసిందే. అంతే కాకుండా ఎలక్షన్ల సమయంలో బోండా ఉమా కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, ఇన్ని కబ్జాలు, దాడులు చేయడం ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ తనకు చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రావడం ఆయనలో అహంకారాన్ని పెంచాయేమో అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
మొత్తం మీద బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మరి జనసేన తరపున ఈ వ్యాఖ్యలు ఎవరైనా ఖండిస్తారా అన్నది వేచి చూడాలి