రాజకీయాలలో ఒక పార్టీ నేతలు ఒక మెట్టు దిగి మాట్లాడితే, అవతలివారు మరో నాలుగు మెట్లు దిగి మాట్లాడుతుంటారు. అంటే అదేదో విషయంపై పట్టు విడుపుల ప్రదర్శించడానికి అనుకొంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఇది నేతల బాష విషయంలో తమ స్థాయి దిగజార్చుకోవడం గురించి చెపుతున్న విషయం.
వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె. రోజా నోటి దురద గురించి కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. మొన్న ఆమె వైజాగ్ వచ్చినప్పుడు “తెదేపాలో మగాళ్ళు ఎవరూ లేకపోవడం చేతనే వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకొంటున్నారని” ఎద్దేవా చేసారు. తెదేపా చేస్తున్న పని అప్రజాస్వామికమే కావచ్చు కానీ దాని గురించి విమర్శించవలసి వస్తే అమోదయోగ్యమయిన బాషని ఉపయోగిస్తే ఎవరూ తప్పు పట్టలేరు. కానీ మహిళా ఎమ్మెల్యే అయిన రోజా తెదేపాలో నేతల మగతనం గురించి ఆవిధంగా మాట్లాడటం చాలా విస్మయం కలిగిస్తుంది.
ఆమె చేసిన విమర్శలకు తెదేపా నుంచి అంతకంటే ఘాటు సమాధానమే వచ్చింది. మాటకి మాట విసరడంలో ఆమెకు సరిసాటి అయిన తెదేపా ఎమ్మెల్యే బొండా “ఒకప్పుడు తెదేపాలో ఉన్న రోజాకి మా పార్టీలో ఎంత మంది మగవాళ్ళున్నారో, ఆడవాళ్లున్నారో బాగా తెలుసు. వైకాపాలో ఆమె నోటి దురుసును తట్టుకోలేక, జగన్ నిరంకుశత్వాన్ని భరించలేకనే వైకాపా ఎమ్మెల్యేలు వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. రోజా తన అశ్లీల బాషను మానుకోకపోతే ఏదో ఒకరోజు మహిళలే ఆమెకు తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని రోజాకి జవాబు చెప్పారు.
రోజాని అశ్లీల బాష మానుకోమని హితవు చెపుతున్న బొండా ఉమా మహేశ్వరరావు కూడా అటువంటి బాషనే ఆమెపై ప్రయోగించడం శోచనీయం. రాజకీయ నేతలు రాజకీయాల స్థాయిని, తమ బాష స్థాయిని ఎంతగా దిగజార్చుకొంటే దానికి మళ్ళీ వారే బాధితులుగా మారుతారని ఈ మాటలే నిరూపిస్తున్నాయి. అయినా ఎవరూ కూడా వెనక్కి తగ్గాలనుకోకపోవడమే విస్మయం కలిగిస్తుంది.