తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పార్టీ మారబోతున్నారు. బొండ ఉమ మొన్నటి ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణుపై ఓడిపోయారు. ఇదే నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి సుమారు 4 వేల 900 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే తనను 25 ఓట్ల తేడాతో ఓడించటం, పార్టీలోని ఒక వర్గం పనేనని బొండా ఉమామహేశ్వరరావు మొదట్నుంచి తన సహచరుల వద్ద ప్రస్తావిస్తూనే వచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో బొండా ఉమా సన్నిహితంగా ఉండేవారు. కానీ తర్వాత దూరమయ్యారు.
ఎన్నికలకు ముందుగానే పారిశ్రామికవేత్త కోగంటి సత్యంతో బొండా ఉమాకు వివాదం ఏర్పడింది. ఎన్నికల సమయంలో బొండ ఉమాకు వ్యతిరేకంగా కోగంటి సత్యం పనిచేశారు. ఇటీవల రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్ట్ అయ్యారు. అప్పుడు బొండా ఉమపై.. కోగంటి సత్యం ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలన్నింటితో… తాను పార్టీ మారడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన బంగీ జంప్ చేస్తున్న వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రాజకీయాల్లో తాను వేయబోతున్న సాహసమైన అడుగు ఇలా ఉంటుందంటూ విదేశాల్లో స్వయంగా బంగీ జంప్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు.
వీడియో, ఆయన చేసిన కామెంట్స్ తో బొండ ఉమా పార్టీ మారతారనే ప్రచారాన్ని ధ్రువీకరించినట్లైంది. రెండ్రోజుల్లో విదేశీ పర్యటన ముగించుకుని బొండ ఉమా విజయవాడకు వస్తారని అనుచరవర్గం చెబుతుంది. ఆయన వచ్చిన తర్వాత పార్టీ మారే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని అనుచరులు అంటున్నారు. ఇప్పటికే.. ఇద్దరు మంత్రుల ద్వారా పార్టీ కీలక నేతతో హైదరాబాద్ లో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ పదవిని ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కానీ బొండా ఉమ రాకను.. అటు విజయవాడ సెంట్రల్, తూర్పు వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.