151 అసెంబ్లీ స్థానాలతో… తిరుగులేని విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్.. వచ్చే మున్సిపల్ , స్థానిక ఎన్నికలపై ఇప్పటి దృష్టి పెట్టింది. తాము ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో… అక్కడ టీడీపీ నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ టీడీపీ నేతలను చేర్చుకునేందుకు వైసీపీ ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారని.. కొంత మందితో చర్చలు కూడా జరిపారని.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం జరుగుతున్న వారిలో… మొన్నటి ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన.. బొండా ఉమామహేశ్వరరావు, గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ఉన్నారు.
విజయవాడలో బలమైన టీడీపీ నేతల్ని ఆకర్షించేందుకు వైసీపీ.. ఆడుతున్న మైండ్ గేమే… పార్టీ మార్పు వార్తల ప్రచారమని.. టీడీపీ నేతలు అంటున్నారు. అధికార పార్టీ అనే అడ్వాంటేజ్… ప్రాధాన్యత ఇస్తామనే సందేశాన్ని ఇలాంటి ప్రచారాల ద్వారా పంపుతున్నారని.. ఎవరైనా టీడీపీ నేతలు.. కాస్త సానుకూలత చూపితే.. మిగతా చర్చల కోసం.. వైసీపీ నేతలు రంగంలోకి దిగుతారని అంటున్నారు. మొదట బొండా ఉమ మీద ఇదే తరహా ప్రచారం చేసి.. ఆ తర్వాత వెంటనే.. దేవినేని అవినాష్ పేరును రంగంలోకి తీసుకు రావడం.. ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చినా చాలన్న గేమ్ ప్లాన్ ఉందంటున్నారు. కానీ ఇది రివర్స్ అవుతోందన్న అభిప్రాయం.. వైసీపీ నేతల్లోనే వస్తోంది.
ఓటమి తర్వాత బొండా ఉమ ఎదుర్కొన్న పరిణామాలతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అదే సమయంలో.. వైసీపీ నేతలు … టచ్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయనకు.. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలతోపాటు.. ఆయన అనుచరులుకు… రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ టిక్కెట్లు ఇస్తామన్న హామీ ఇచ్చారు. ఇద్దరు మంత్రుల మధ్యవర్తిత్వంతో.. హైదరాబాద్లో.. వైసీపీ ముఖ్యనేతల వద్ద చర్చలు జరిగాయని కూడా చెప్పుకున్నారు. అయితే.. వెంటనే దేవినేని అవినాష్ పేరును కూడా వైసీపీ ప్రచారంలోకి తెచ్చి.. తూర్పు నియోజకవర్గ హామీనే ఇచ్చినట్లు తేల్చడంతో.. బొండా ఉమ అసంతృప్తికి గురయ్యారు. వైసీపీలోకి వెళ్తే వంగవీటి రాధా తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని సందేహిస్తున్నారు. అందుకే ఆయన మళ్లీ సోమవారం చంద్రబాబుతో భేటీకి సిద్ధమయ్యారంటున్నారు.