పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ అయిపోయింది. గత నాలుగు రోజులుగా ఆయన చేసిన ట్వీట్లన్నీ ఓ అర్థగంటలో చదివేసినట్టుగా ఆయన మాట్లాడారు. అయితే, ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో ఉన్న దోస్తీ గురించి మరోసారి స్పందించారు. ప్రజలతో కలిసి పనిచేయాలన్న కామన్ అజెండాతోనే గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చాననీ… అది జరగనప్పుడు బయటకి వచ్చేయడానికి కూడా వెనకాడనని అన్నారు! ప్రత్యేక హోదాపై సీఎం ఎందుకు రాజీపడ్డారని కూడా ప్రశ్నించారు. పవన్ ప్రెస్ మీట్ అయిన వెంటనే తెలుగుదేశం నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. జనసేనకు తెలుగుదేశం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ… మిత్రభేదం అవసరం లేదన్న భరోసా కలిగించే విధంగా స్పందించారు.
నిన్నమొన్నటి ఉద్దానం ఇష్యూ మొదలుకొని.. రాజధాని భూసేకరణ సమస్య వరకూ… పవన్ కల్యాణ్ ఏ సమస్య లేవనెత్తినా వెంటే స్పందించామని బోండా అన్నారు. పోలవరం ప్రాజెక్టు మీద ఆయనకు ఏవైనా అనుమానాలు ఉంటే.. స్పష్టమైన ఆరోపణలతో వస్తే.. నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కావాలంటే, ఆయనే స్వయంగా విచారణ జరిపించుకున్నా తమకు ఇబ్బంది లేదని బొండా చెప్పారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలనీ.. ఏ పరిస్థితుల్లో కేంద్రం ఇవ్వలేకపోతోందో కూడా తెలుసుకోవాలనీ.. దానికి బదులుగా ఇచ్చిన ప్యాకేజీలో అన్ని ప్రయోజనాలూ ఉన్నాయని బోండా చెప్పుకొచ్చారు.
ఏతావాతా బొండా చెప్పొచ్చేది ఏంటంటే… మీరు తెలుగుదేశంతోనే కలిసి ఉండండీ, మీరు ఏ అంశాన్ని లేవనెత్తినా వెంటనే స్పందించేస్తాం, మీ హెచ్చరికల్ని కూడా సూచనలుగా భావిస్తాం, మీరేం చెప్పినా మేము సానుకూలంగా అత్యంత సావధాన చిత్తులమై ఆకలిస్తామంటూ తెలుగుదేశం పార్టీ మాటగా చెప్పినట్టే అనిపిస్తోంది! పవన్ విషయంలో టీడీపీ చాలా స్పష్టంగా ఉన్నట్టు ఇంకోసారి నిరూపణ అయింది. ప్రత్యేక హోదా విషయంలో కూడా టీడీపీ వైఖరి మరోసారి సుస్పష్టం. “ప్యాకేజీతో మేం సంతృప్తి చెందాం.. హోదా గురించి కేంద్రాన్ని అడిగేదే లేదు” అనేది బోండా వాయిస్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. ఇదే విషయాన్ని పవన్ కూడా అర్థం చేసుకోవాలన్నది బిట్వీన్ ద లైన్స్‌లో ధ్వనిస్తోంది. తమ చిటికెన వేలును వదిలేది లేదంటూ… చిన్నపిల్లాడిని బుజ్జగిస్తున్నట్టున్న దేశం మాటలకు పవన్ పడిపోతారా..? ఆంధ్రుల ప్రత్యేక హోదా ఆకాంక్షను విశాఖ బీచ్ లోనే వదిలేస్తారా.. అనేది కాలమే నిర్ణయించాలి.