జాన్వీ కపూర్… టాక్ ఆఫ్ ది టాలీవుడ్. తను చేస్తోంది ఒకే ఒక్క సినిమా. అదే.. ‘దేవర’. ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎన్టీఆర్ తో కెమిస్ట్రీ ఎలా ఉంటుందన్నది మొన్నొచ్చిన పాటతోనే తేలిపోయింది. కచ్చితంగా జాన్వీకి మంచి ఫ్యూచర్ ఉంది. నాని సినిమాలో జాన్వీని కథానాయికగా ఎంచుకొన్నారని తెలుస్తోంది. దాంతో పాటు చరణ్ సినిమా కూడా ఉంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో తనని హీరోయిన్ గా తీసుకొనే ఛాన్సులున్నాయని టాక్. నిజానికి జాన్వీ చేతిలో ఇప్పటికి ఓ అరడజను తెలుగు సినిమాలు ఉండాలి. కానీ.. లేవు. దానికి కారణం.. బోనీ కపూర్.
జాన్వీ కెరీర్ మొత్తం ఇప్పుడు బోనీ చేతిలో ఉంది. జాన్వీ ఓ సినిమా ఒప్పుకోవాలన్నా, అడ్వాన్సు తీసుకోవాలన్నా, ఆఖరికి ఓ కథ వినాలన్నా.. ముందు బోనీ అనే గేటు దాటాలి. లేదంటే లేదు. బోనీ పారితోషికం విషయంలో మరీ భీష్మించుకొని కూర్చుంటున్నాడని, సెట్లో జాన్వీకి ఇవ్వాల్సిన సదుపాయాల విషయంలో గీచి గీచి మరీ బేరాలు ఆడుతున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు నుంచి ఎంతమంది దర్శకులు, నిర్మాతలు జాన్వీ డేట్ల కోసం ఎగబడుతున్నా బోనీ ఏమాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది. బోనీ వల్లే… జాన్వీకి ఇప్పటి వరకూ రావాల్సిన అవకాశాలు అందకుండా పోయాయని జాన్వీ సన్నిహితులు వాపోతున్నారు.
Also Read : ‘పుష్ష’ కోసం జాన్వీకి రూ.4 కోట్లు ఇస్తారా?
నిజానికి హీరోయిన్లు ఎక్కువగా మేనేజర్లపై ఆధారపడుతుంటారు. కొంతమంది అమ్మ మాటకు కట్టుబడి ఉంటారు. జాన్వీ మాత్రం పూర్తిగా తండ్రిపై ఆధారపడిపోయింది. బోనీకి సినిమా నిర్మాణంపై అవగాహన ఉంది. ఇక్కడి పరిస్థితిలు ఆయనకు తెలుసు. అయినా సరే, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొత్త దర్శకులు, నిర్మాతలు జాన్వీని సంప్రదించాలనుకొన్నా ‘బోనీని దాటుకొని వెళ్లగలమా’ అంటూ ముందే వెనకడుగు వేస్తున్నార్ట. ఇది జాన్వీ కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదేమో..?!