గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇప్పుడు మేయర్ పీఠం వరించబోయేది ఎవ్వరిని? అనే అంశం పార్టీలో కీలకంగా చర్చనీయాంశంగా ఉంది. ‘T360’ ముందే చెప్పినట్లుగా.. మేయర్ పీఠాన్ని పార్టీ విధేయులకు, ఉప మేయర్ పీఠాన్ని ఆంధ్రా సెటిలర్లలో ఒకరికి ఇవ్వడానికి సూత్రప్రాయంగా కేసీఆర్ అంగీకరించి ఉన్నట్లుగా సమాచారం. అయితే కీలకమైన మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం పార్టీలో చాలా కసరత్తులు జరుగుతున్నాయి. ఒకవైపు మహిళలకు కేసీఆర్ అవకాశం కల్పించే ఉద్దేశం ఉన్నదనే ప్రచారం ఉండగా.. ఇతరులు కూడా తమ ఆశలను వదలుకోవడం లేదు.
ఎన్నికలకు ముందునుంచి పార్టీ నాయకుడు బొంతు రామ్మోహన్ పేరు మేయర్ స్థానానికి ప్రాబబుల్గా బలంగా వినిపించింది. అయితే ఒక దశలో ఆయన పోటీచేస్తున్న డివిజన్లో పోటీ బలంగా ఉన్నదనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు సిటీ అంతా వెల్లువెత్తిన తెరాస హవాలో బొంతురామ్మోహన్ కూడా విజయం సాధించారు. ఆయన మేయర్ పీఠం మీద కర్చీఫ్ వేసిపెట్టి, పార్టీలో తనకు అవకాశం ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మేయర్ పీఠంపై తన ఆశలను దాచుకోవడానికి కూడా ఆయన ప్రయత్నించడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం, దాన్ని చేరుకునే అన్ని మార్గాల్లోనూ బొంతు రామ్మోహన్ చాలా పెద్ద ఎత్తున హోర్డింగులను ఏర్పాటుచేశారు. అద్భుతమైన విజయం సాధించిన తెరాసకు, అధినేత కేసీఆర్, సారథ్యం వహించిన కేటీఆర్‌లకు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా తన ఫోటో కూడా పెట్టుకుని బొంతు రామ్మోహన్ తరఫున పెద్దసంఖ్యల్లో హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. సెక్రటేరియేట్ మార్గం, సీఎం క్యాంపు ఆఫీసు చేరుకునే అన్ని మార్గాల్లోనూ పెద్దసంఖ్యలో ఈ హోర్డింగులు ఉన్నాయి. అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఆయన తరఫు ముమ్మర ప్రయత్నంగా కనిపిస్తోంది.
అదే సమయంలో కేసీఆర్ మేయర్ పీఠాన్ని మహిళలకు కట్టబెడతారనే ప్రచారం కూడా పార్టీలో ఉంది. కేబినెట్లో ఆడవారికి చోటు కల్పించలేదు గనుక.. మహిళలంటే కేసీఆర్‌కు చిన్నచూపు అని, మహిళాద్వేషి అని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వాటిని తుడిచేయడానికి మేయర్‌ను మహిళ చేతిలో పెడతారనే ప్రచారం ఉంది. అదే నిజమైతే ఎవరిని ఎంచుకుంటారనేది కీలకం. పార్టీ ఎంపీ కేకేశవరావు కుమార్తెకు ఇది దక్కవచ్చునని కూడా ఒక ప్రచారం నడుస్తోంది. మహిళలకు అవకాశం అనే దృష్టితో చాలామంది మహిళా కార్పొరేటర్లు తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో రెండు రోజుల్లో తేలుతుంది.