కడప జిల్లాకి చెందిన ఒక ప్రముఖ వైకాపా ఎమ్మెల్యే త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సదరు నేత పార్టీలో నుండి జంప్ అవక మునుపే ఇప్పుడు కృష్ణా జిల్లాకి చెందిన మరో సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా ఎమ్మెల్యే పేరుని మీడియా కూడా బయటపెట్టలేదు కానీ వేదవ్యాస్ పేరును బయటపెట్టడం గమనార్హం. అంటే వేదవ్యాస్ పార్టీ మారడం ఖాయం అని భావించవచ్చును.
ఆయన కాంగ్రెస్ నుండి ప్రజా రాజ్యంలోకి వెళ్లి దానితో బాటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిపద్దారు. మళ్ళీ నిరుడు జరిగిన ఎన్నికలలో వైయస్సార్ పార్టీలోకి జంప్ చేసి పెడన నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీలోకి మారుదామని ప్రయత్నించారు కానీ ఎందువల్లో మారలేదు. ఇప్పుడు ఆయన తెదేపాలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందని తాజా సమాచారం. ఏ కార్యక్రమం మొదలుపెట్టడానికయినా విజయదశమి చాలా మంచి రోజుగా భావిస్తారు కనుక వేదవ్యాస్ అదేరోజు పార్టీ మారవచ్చునని సమాచారం.
తెదేపాకు మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో వైకాపా ఎంత ప్రయత్నించినా బలపడలేదనే ఉద్దేశ్యంతోనే ఆయన పార్టీ మారబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడకి తరలివస్తే తెదేపా నేతలు, మంత్రులు అందరూ అక్కడే ఉంటారు కనుక కృష్ణ, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, జిల్లాలపై వారి పట్టు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు సహజంగానే ఆ ప్రాంతాలలో వైకాపా బలహీనపడవచ్చును. బహుశః బూరగడ్డ వేదవ్యాస్ ఈ సంగతిని అందరి కంటే ముందే పసిగట్టి, తెదేపాలో ‘నో-వేకెన్సీ’ బోర్డు పెట్టేయక ముందే అందులో చేరిపోవాలనుకొంటున్నారేమో?