తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఏపీ ఉద్యోగులందరూ తమ ప్రభుత్వం వైపుచూస్తున్నారు. ఎవరికీ నోరెత్తేంత ధైర్యం లేదు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా నోరెత్తరు. అయితే ఏపీ అమరావతి ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు అనే నేత మాత్రం ఇటీవలి కాలంలో ఉద్యోగుల సమస్యలపై కాస్తంత గొంతెత్తుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన తెర ముందుకు వచ్చారు. తెలంగాణలో ఇచ్చినట్లుగా ఏపీ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇతర ఉద్యోగ సంఘ నేతలెవరూ.. పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు. ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ.. ఉద్యోగులందరికీ.. తానే పెద్ద అన్నట్లుగా ఉండే వెంకట్రామిరెడ్డి అసలు మాట్లాడటం లేదు. దీంతో ఉద్యోగులు.. తమ పీఆర్సీ గురించి మాట్లాడే నేతల కోసం ఎదురు చూస్తున్నారు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని నిలదీయడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజులుగా ఆయన ఉద్యోగుల సమస్యలపై కాస్త ఘాటుగానే మాట్లాడుతున్నారు. ఆయన సంఘాన్ని చీల్చే ప్రయత్నాన్ని ఇతరులు చేయడంతో ఆయన ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్‌లోఉన్నాయి. వీటిపై ప్రభుత్వాన్ని ఏమీ అనలేక.. బొప్పరాజు.. ఆర్థిక శాఖపై విమర్శలు చేస్తున్నారు. డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 20శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. అమలు చేశారు. దాన్నే సీఎం జగన్ వచ్చిన తర్వాత అమలుచేస్తున్నారు. పీఆర్సీ నివేదిక ప్రభుత్వం చేతికి అందినప్పటికీ ఏ నిర్ణయం తీసుకోవడ లేదు. ఆదాయం తగ్గిపోవడం… ఖర్చులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడుతోంది. ఈ క్రమంలో… ఉద్యోగుల పీర్సీపై అసలు ఆలోచన చేయడం లేదు. డీఏల గురంచే నాన్చుతున్న ప్రభుత్వం… కరోనా కారణంగా కత్తిరించిన జీతాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించడం లేదు. ఇక పీఆర్సీ గురించి ఏం మాట్లాడతారన్న నిష్టూరం ఉద్యోగుల్లో వినిపిస్తోంది.