ఉద్యోగ సంఘాల పేరుతో జగన్ రెడ్డి చేసిన రాజకీయానికి తమ వంతు తబలా వాయించిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు బయటకు రావడం లేదు. మంచి ప్రభుత్వం… ఏమన్నా భరిస్తోంది అని తాజాగా బొప్పరాజు వెంకటేశ్వర్లు తెరపైకి వస్తున్నారు. మళ్లీ మోసపోయామని అంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం కూడా మోసం చేసిందట. ఎందుకంటే మూడు డీఏలు ఇవ్వాలని కనీసం ఒక్క డీఏ అయినా ఇవ్వడం లేదని ఆయనంటున్నారు. డీఏ ఇస్తే పీఆర్సీ ప్రకటించాల్సి వస్తుందని ప్రకటించడం లేదని అంటున్నారు.
జగన్ హయాంలో ఈ ఉద్యోగ సంఘం నేతలు స్థానిక ఎన్నికలప్పుడు చేసిన రాజకీయం గుర్తున్న ఎవరైనా వీరిని పాపం అని కూడా అనరు. చంద్రబాబు గతంలో నలబై రెండు శాతం పీఆర్సీ ఇస్తే ఆయనపై ఘోరమైన వ్యాఖ్యలు చేసేవారు. జగన్ రెడ్డిని రెండు చేతులతో గెలిపించుకున్నామని ఘనంగా చెప్పుకున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐఆర్ ను జగన్ తగ్గించేసి..డీఏలు కలిపేసి చేసిన వ్యవహారంతో జీతం తగ్గిపోయింది. అయినా వారికి బుద్ది రాలేదు. ఎప్పటికప్పుడు ఉద్యమాలను తాకట్టు పెట్టేసారు. చివరికి పీఆర్సీ ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టారు.
ఇప్పుడు చంద్రబాబు గెలిచే సరికి మళ్లీ నోరు తెరిచేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగ సంఘాల నిర్వాకంతోనే ఉద్యోగులకు తీరని నష్టం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్థితికి వెళ్లారు. జగన్ రెడ్డి హయాంలో లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా చిన్న ఉద్యమం ఉద్యోగులు చేయాలనుకున్నా ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తుంది. అందుకే ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగులకు చేసిన అన్యాయం చేసిన అన్యాయం చిన్నది కాదని చెబుతారు.