ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే అని ప్రకటించిన బొప్పరాజు ఇప్పుడు పూర్తిగా మాట మార్చేశారు. మొన్న ఏపీ ఎన్జీవో నేతల్ని పిలిపించుకుని పొగిడించుకున్న సీఎం జగన్ ఈ సారి చాన్స్ బొప్పరాజు వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. ఇప్పటికే ఉద్యోగుల తరపున పోరాడుతున్న నేత సూర్యనారాయణ ఆజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ముందస్తు బెయిల్ కూడా దొరకలేదు. ఇన్ని తిప్పలెందుకనుకున్నారేమో కానీ.. బొప్పరాజు కూడా వెంటనే సీఎం జగన్ దగ్గరకు వచ్చి శరణు శరణు అనేశారు.
కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపామని నిర్మోహమాటంగా ప్రకటించుకున్నరాు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించనందుకే ఉద్యమం చేశామని.. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సీఎంకు చెప్పామని చెప్పుకొచ్చారు. 47అంశాలపై సీఎస్ కు మేము లేఖ ఇస్తే 36అంశాలను పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని.. అన్ని అంశాలను కేబినెట్ లోకి తీసుకు వచ్చి పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపామన్నారు. సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘాలపై పలువురు మాకు వ్యతిరేకంగా పలు రకాల చర్చ నడుపుతున్నారని.. ప్రభుత్వానికి ఉద్యోగులను దూరం చేసేందుకే ఈ చర్చ నడుపుతున్నారని ఆరోపించారు.
మరో వైపు సీఎం జగన్ కూడా వారికి అదే పద్దతి చెప్పాల్సింది చెప్పారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా పూర్తిగా అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించానని.. . ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డైలీవేజ్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకుని రావాలని ఈ సందర్బంగా అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఉద్యోగులంతా సంతోషంగా ఉంటే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని జగన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం కూడా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన మాటలు విన్న ఉద్యోగులకు నిజమేనని అనుకుంటున్నారు.